ఏమాట కామాటే చెప్పుకోవాలి గానీ సినీ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజుల వలే ఏవైనా సేవ కార్యక్రమాలు, విరాళాలు ఇవ్వడంతో అక్కినేని నాగేశ్వరరావు అంత ఉదారత చూపేవాడు కాదు. నాగార్జున కూడా బిజినెస్ మైండెడ్ అనే పేరుంది. కాస్త అమల మాత్రమే బ్లూక్రాస్ ద్వారా మంచి సేవలందిస్తోంది. ఇక కొత్తగా అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన సమంత మాత్రం తన దాన గుణం ద్వారా మెప్పు పొందుతోంది. ఈ విషయంలో తన భర్త నాగచైతన్య యాక్టివ్‌గా లేకపోయినా ఫ్యామిలీ పర్మిషన్‌తో ప్రత్యూష సేవా సంస్థ ద్వారా పేద, వికలాంగులు వంటి వారికి సాయ పడుతోంది.
ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు మార్లు అందరికీ సాయం చేసిన సమంత ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. ఆమె అతి తక్కువ చిత్రాలతోనే స్టార్ హీరోలందరి సరసన నటించి చివరకు తన మొదటి చిత్రం హీరోనే 'ఏమాయ చేసేవే' అన్న విధంగా పెళ్లాడి అక్కినేని కోడలిగా, హైదరాబాదీగా మారింది ఈ చెన్నై చిన్నది. ఇక నాగచైతన్య-సమంతల వివాహం గోవాలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తమకు వచ్చిన విలువైన బహుమతులన్నింటినీ బహిరంగ వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా విలువైన సేవలు అందించడానికి రెడీ అయింది.
ఇప్పటికే ఆమె భర్త నాగచైతన్య, అత్తమామలు నాగార్జున, అమల అనుమతిని కూడా పొందిందని సమాచారం. మొత్తానికి ఓ మంచి కార్యక్రమానికి పూనుకుని, అందరూ ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా ఉంచుకునే పెళ్లి, రిసెప్షన్ బహుమతులను వేలంవేసి సమాజ సేవకు ఉపయోగపడుతున్న అక్కినేని కోడలికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.