హీరో శ్రీకాంత్, రవితేజ, శ్రీహరి వంటి వారిని తన కెరీర్‌లో బాగా ప్రోత్సహించి ఆదరించి, వెన్నుదన్నుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తన సాయం కోరిన వారిని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రాంప్రసాద్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం, ఆయనతో ఉన్న పరిచయాన్ని చెబుతూ, చిరంజీవి గారు నటనలో శిఖరం. ఆయన చిత్రంలో నేను నటిస్తానని అనుకోలేదు. ఇక మేము ఇల్లుకట్టుకున్న సందర్భంగా చిరంజీవి గారిని కలసి ఆయనను ఆహ్వానించాలని భావించాం. పీఏకి ఫోన్‌చేస్తే రమ్మని చెప్పాడు. ఈ సందర్భంగా మేమే మా ఆహ్వాన పత్రికను చిరంజీవిగారికి ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత నేను, నా భార్య ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. గృహప్రవేశం రోజు చిరంజీవిగారి నుంచి పట్టుబట్టలు, బొకేలతో విషెస్ వచ్చింది.
ఇక నేను గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్‌లం ముగ్గురం ఐదేళ్ల నుంచి కలిసి కట్టుగా జబర్దస్త్‌తో పాల్గొంటున్నాం. మాకు విడివిడిగా గ్రూప్‌లు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా విడిపోవడం సరికాదని ఇంకా సాగుతున్నాం. మా మద్య ఫలానా వాడికి పేరుస్తోంది అనే జెలసీ మా ముగ్గురికి లేదు. సుడిగాలి సుధీర్‌కి నటునిగా మంచి క్రేజ్ ఉంది. ఇక గెటప్ శ్రీను గెటప్‌లు వేయడంలో ఎక్స్‌పర్ట్. నేను స్క్రిప్ట్ రాయడంలో ఎక్స్‌పర్ట్. ఇలా ముగ్గురం సమన్వయం చేసుకుంటున్నాం. మొదట నేను ఎడిటర్‌ని కావాలని హైదరాబాద్ వచ్చాను, కొన్ని చిత్రాలకు పనిచేసిన తర్వాత 'జోష్' చిత్రంలో చిన్న పాత్ర కూడా చేశాను. తర్వాత ఇది మనకి వర్కౌట్‌కాదని ఊరెళ్లిపోయాను. అప్పుడు నా స్నేహితుడు ప్రసన్నకుమార్ ఫోన్ చేసి స్క్రిప్ట్ రాయడంలో నీవు ఎక్స్‌పర్ట్‌వి కదా...! 'జబర్దస్త్' అనే ప్రోగ్రాం స్టార్ట్ అవుతోంది. ట్రై చేయ్ అనడంతో ఈ ప్రోగ్రాంకి వచ్చి రైటర్‌గా, నటునిగా రాణిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి మెగా బ్రదర్ నాగబాబు పుణ్యమా అని జబర్దస్త్ లో నటించే వారంతా మెగా భజనలో సిద్దహస్తులై, ఇతర హీరోల మీద సెటైర్లు వేస్తూ మెగా హీరోల సినిమాలలో ఛాన్స్‌లు పొందుతూ, 'జబర్దస్త్'ని మెగా ఫ్యామిలీ ప్రోగ్రాంగా మార్చివేశారని మాత్రం చెప్పవచ్చు. హైపర్ ఆది నుంచి మహేష్, రాంప్రసాద్‌ల వరకు ఇదే భజన!