సెలబ్రిటీ హోదా వచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ హోదాని జాగ్రత్తగా కాపాడుకుంటేనే పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. అంతే గానీ సామాన్యులు చేస్తే తప్పులేదు.. మేము చేస్తేనే తప్పా? మేము చేస్తే ప్రతి ఒక్కరు ఎందుకు మా మీదనే విరుచుకుపడతారు? మీడియాకి సినిమావారు, సెలబ్రిటీలే దొరికారా? మమ్మల్ని విమర్శిస్తే క్రేజ్ వస్తుందనే ఇదంతా చేస్తున్నారు. వంటి వాదనలు తప్పు. సెలబ్రిటీ హోదా రావడం అంత సులభం కాదు. పదిమంది అభిమానులను తన వైపుకి తిప్పుకోవడం సామాన్యమైన విషయమూ కాదు. ఈ విషయంలో సెలబ్రిటీలు తమ మాటలతో, చేతలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపకూడదు. బాలయ్య 'కడుపు చేయమని చెప్పినా, మీడియాను బూతులు తిట్టినా, ఫ్యాన్స్‌ని కొట్టినా పోయే పరువు బాలయ్యదే గానీ సామాన్యులది కాదు'. ఇక కిందటి ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపవద్దని కోరిన యాంకర్, నటుడు ప్రదీప్ ఈ ఏడాది న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్బంగా తాగి వాహనం నడుపుతూ బుక్కయ్యాడు. దీంతో అప్పటివరకు బుల్లితెరపై ఆయన్ను ఇష్టపడిన వారు కూడా ప్రదీప్ ఇలాంటోడా ? అని విస్తుపోయారు.
ఇక్కడ సెలబ్రిటీలైనా మాకు మాత్రం స్వేచ్చ లేదా? మేము చేస్తేనే తప్పా? మాకు పర్సనల్ జీవితం ఉండదా అని వాదన చేయడం అనసవరం. సెలబ్రిటీ హోదా కావాలంటే కొన్ని విషయాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి పోలీసుల కౌన్సిలింగ్‌కి కూడా ప్రదీప్ హాజరుకాకపోవడం, కేవలం షూటింగ్స్ బిజీలో ఉన్నానని వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. కాగా కోర్టు ఈయన డ్రైవింగ్ లైసెన్స్‌ని మూడేళ్లు రద్దు చేసి, 2,100 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రదీప్ వంటి సెలబ్రిటీ మద్యం సేవించడం తప్పు కాకపోయినా డ్రైవింగ్ కోసం వేరే వారి సహాయమో, లేక ట్యాక్సీగట్రా చూసుకోవడమే, లేక మద్యం దిగేంత వరకు అక్కడే ఉండిపోవడమో చేయాల్సింది.
ఇక సెలబ్రిటీలను కూడా కఠినంగా శిక్షించడం పోలీసుల, కోర్టు విలువను, నిజాయితీని పెంచే నిర్ణయమే. మొత్తానికి తమకు పలుకుబడి ఉందని, ఎవరినైనా కాల్చినా కూడా కాకర్లసుబ్బారావు వంటి వారు మానసిక ఆరోగ్యం బాగాలేదని సర్టిఫికేట్లు అయితే ఇవ్వగలరు గానీ ప్రజల్లో ఏర్పడే ఏహ్యతను మాత్రం తప్పించుకోలేరు. ఇక ప్రదీప్ విషయంలో కూడా జడ్జి డ్రంక్ ఆండ్ డ్రైవ్ వద్దని ప్రచారం చేస్తున్నమీలాంటి వారు కూడా మద్యంతాగి వాహనం నడపకూడదని మందలించడం కూడా సమంజసమే. మరి ఈ గౌరవాన్ని ఇకనైనా ప్రదీప్ కాపాడుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది....!