అందరికీ కత్తి మహేష్ మాత్రమే కనిపిస్తున్నాడు గానీ పవన్ వీరాభిమానుల వల్ల ఇబ్బందులు పడిన వారిలో వారి సోదరులు, బన్నీ వంటి వారే గాక పవన్‌పై సునిశిత విమర్శలు చేసే జర్నలిస్ట్ వరకు పవన్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకుంటున్న మాట మాత్రం వాస్తవం. ఎలాగోలా కత్తి మహేష్ రూపేన అది బహిర్గతమైంది. ఇక మూడు నాలుగు నెలలుగా సాగుతోన్న ఈ రచ్చ, ఛానెల్స్ మీతి మీరి చేస్తున్న చర్చ వల్ల పరిష్కారం లభించదేమో అనేంతగా పరిస్థితి దిగజారింది. కోనవెంకట్, తమ్మారెడ్డిలు మౌనం వహించారు. మరోవైపు పవన్ అభిమానులు తగ్గడం లేదు. చివరకు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు అటు మెగాభిమానులుగా, ఇటు దళిత విద్యార్ధులుగా గ్రూప్‌లుగా విడిపోయి క్యాంపస్‌లో హింసాగ్ని జరిగే ప్రమాదం పొంచి ఉన్నదనే రకంగా ఈ వ్యవహారం ముదిరింది. మొత్తానికి పవన్ 'ఇగో' మరోసారి బహిర్గతమైంది.
అభిమానులు చేసింది తప్పు అని చెప్పకుండా, తన అభిమానులపై పల్లెత్తు మాట అనకుండా ఆయన జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ద్వారా ప్రెస్‌నోట్ విడుదల చేయించారు. తప్పుని తప్పు అని నిగ్గదీయడానికి పవన్‌కి వచ్చిన 'అహం' ఎందుకో అర్ధం కాని విషయం. మొత్తానికి ఎలోగోలా ఈ వివాదం సమసినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ జనసేన పేరిట విడుదలైన ప్రెస్‌నోట్‌లో ఈ పనులను, పవన్‌ని చెడ్డగా చూపించేందుకు కొందరు వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారని చెబుతూ, తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. పవన్‌ని సామాన్యులందరూ రాజకీయాలలో చిరంజీవి కంటే ఎక్కువగా స్వాగతించారు. అదే సమయంలో పవన్ వీరాభిమానుల అత్యుత్సాహమే ఆయనను మరింత దిగజార్చేలా ఆయన వ్యతిరేకులు చెడుగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటే దానికి పవన్ అభిమానులే బాధ్యులు.
వారు తమ అత్యుత్సాహం ద్వారా ఆయన వ్యతిరేకులు, మీడియాకి, ఇతర అభిమానులు పవన్‌ని, పవన్ ఫ్యాన్స్‌ని తప్పుపట్టేలా చేయగలిగారనే చెప్పాలి. ఇక నుంచైనా పవన్ అభిమానులు విమర్శలను సరిగ్గా హేతుబద్దంగా, జనాలందరు మెచ్చుకునే రీతిలో ఆయన మంచి భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ అంటే కేవలం ఆయన అభిమానులు, ఆయన సామాజిక వర్గం వారే అన్న అపోహను తొలగించి పవన్ భావాలను ప్రచారం చేయగలిగినప్పుడే పవన్ అభిమానులు. పవన్ మౌనంపై సామాన్యులలో ఉన్న అపోహలు తొెలిగే అవకాశం అప్పుడు ఉంటుంది.
ఇక పార్టీ పుట్టింది 4ఏళ్ల కిందటే. ఇది పసిప్రాయం, ఎదగనివ్వకుండా చేస్తున్నారు... అనే వాదనలో కూడా సరైన పస కనిపించడం లేదు. తమ్మారెడ్డి భరద్వాజ చెప్పినట్లు నాయకులను, హీరోలని విమర్శిస్తే మూలాలలోకి వెళ్లి చర్చ జరపాల్సింది పోయి దూకుడు చర్యలు అనర్ధదాయకం. మరోవైపు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, జగన్, చంద్రబాబు, ముద్రగడ, చిరంజీవి వంటి వారు నేడు కుల నాయకులుగా మిగిలిపోతున్న వైనం పవన్‌కి , ఆయన ఫ్యాన్స్‌కి జ్ఞానోదయం కలిగించాలి. తమ హీరోని కూడా కుల రొంపిలోకి, వివాదాలలోకి లాగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పవన్, ఆయన ఫ్యాన్స్, ఆయన జనసేన పార్టీ కార్యకర్తలదే అని చెప్పాలి.