ఏవో ఎప్పుడో గానీ తెలుగులో బయోపిక్స్ రావు. 'శ్రీనాథ కవిసార్వభౌమ, భక్త కన్నప్ప, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటివి వస్తుంటాయి. కానీ వీటిలో ఏదీ వివాదాస్పదం కాదు. కానీ ప్రస్తుతం 'మహానటి' ద్వారా సావిత్రి బయోపిక్, త్వరలో ఎన్టీఆర్ బయోపిక్‌లు రూపొందనున్నాయి. ఇక 'సావిత్రి' జీవితంలో ఎన్నో వివాదాలు, విస్తుగొలిపే వాస్తవాలు ఉన్నాయి. సావిత్రి చివరి రోజుల్లో కేవలం దాసరి తప్ప ఆమెతో పనిచేసిన ఏ స్టార్ హీరో కూడా ఆమెకి సాయం చేయలేదని, ఆమె జీవితం మద్యం, గుట్కాల వంటి వాటి వల్ల నాశనం అయిందనేది వాస్తవం. ఆమె గురించి నాటి జమున నుంచి కొందరు కథలు కథలుగా చెబుతారు. ఇక ఈమె జీవితంలో విలన్‌గా తమిళ శృంగార తిలగన్‌గా పిలుచుకునే జెమిని గణేషన్ పాత్ర అంటారు. సావిత్రి జెమిని గణేషన్‌ని వివాహం చేసుకునే సమయంలో పలువురు ఆమె సన్నిహితులు అతని స్వభావం మంచిది కాదని, మంచి స్థితిలో ఉన్న సావిత్రిని నడి బజారులో నిలుపుతాడని పలువురు ఆమెకి ముందుగానే చెప్పినా, ప్రేమ గుడ్డిదనే విషయం నిరూపిస్తూ ఆమె తన జీవితం సర్వనాశనం చేసుకుందని అంటారు. ఆమె కుమార్తె చాముండేశ్వరి కూడా తన తల్లిని పూర్తిగా వెనకేసుకుని రాకుండా తప్పు సావిత్రి, జెమిని గణేషన్ ఇద్దరిలోనూ ఉందని చెబుతుంది.
కాగా ఈమె జీవితం సినిమాగా వస్తోందంటే ఇప్పటికే పలు వివాదాలు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావాలి. కానీ అవేమీ రాకుండా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో సావిత్రి నిజజీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తారా? లేక వివాదాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా ఫీల్డ్‌లోనే సావిత్రిని నానా విధాలుగా వంచించిన టాప్ హీరోలు ఎందరో ఉన్నారు. మరి అవి చూపిస్తారా? లేదా? అనేది పక్కనపెడితే నాగ్ అశ్విన్ ఈ చిత్రం కోసం చాలా రీసెర్చ్ చేశాడని, పాత్రల హావభావాలు, ఆహార్యం విషయంలో నేచురల్‌గా తీర్చిదిద్దాడని ప్రశంసలు లభిస్తున్నాయి. 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో జస్ట్ ఓకే అనిపించిన నాగ్ అశ్విన్ దర్శకప్రతిభను ఈ చిత్రం విడుదలైతే గానీ చెప్పలేం.
ఇక ఇందులో సావిత్రిగా కీర్తిసురేష్, జమునగా 'సమంత', జెమిని గణేషన్‌గా 'దుల్కర్‌సల్మాన్'లు నటిస్తున్నారు. ఇక ఇందులో జెమిని గణేషన్‌ని విలన్‌గా చిత్రీకరిస్తే ఆయనకు అభిమానుల మద్దతు ఉన్న తమిళంలో ఈ చిత్రం వివాదం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అలనాటి వాతావరణానికి తగ్గట్లుగా సెట్స్ వేసి వాటిల్లోనే ఎక్కువ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇంత కాలం హీరోగా మెప్పించిన దుల్కర్ సల్మాన్ ఈ పాత్ర ఎలా బ్యాలెన్స్ చేశాడనేది మార్చి 29న ఈ చిత్రం విడుదలైతే గానీ చెప్పలేం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన జెమిని గణేషన్ పార్ట్ అంటే దుల్కర్‌సల్మాన్ పాత్ర చిత్రీకరణ పూర్తియింది. మరోవైపు మార్చి 28న కళ్యాణ్‌రామ్ 'ఎమ్మెల్యే', మార్చి 30న 'రంగస్థలం 1985' మధ్య రోజు భారీ పోటీ మధ్య ఈ 'మహానటి' విడుదల కానుంది.