సాధారణంగా మన స్టార్స్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల కంటే ఎక్కువగా ఫైనాన్స్ పరంగా సేఫ్‌లో ఉండే రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రాల వైపే మొగ్గుచూపుతారు. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. అమీర్‌ఖాన్ 'దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్', అక్షయ్‌కుమార్ 'టాయిలెట్, ప్యాడ్‌మెన్', షారుఖ్ 'ఫ్యాన్, జీరో', వంటి చిత్రాలు దీనికి ఉదాహరణ, ఇక రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా జయాపజయాలకు అతీతంగా సినిమా చేస్తూనే ఉంటారు. రజనీ తన వందవ చిత్రం 'రాఘవేంద్రస్వామి మహత్మ్యం', 'బాబా' , 'కథానాయకుడు', 'చంద్రముఖి' వంటి చిత్రాలు చేశాడు. కమల్‌హాసన్ గూర్చి మరలా స్పెషల్‌గా చెప్పడానికి ఏమీ లేదు. ఇక మెసేజ్ ఓరియంటెడ్ కథలనే తీసుకుని, గ్రామాలలో కక్ష్యలు, ఫ్యాక్షన్‌లు ఉండకూడదని 'మిర్చి', ధనవంతులు తమ సొంత ఊర్లను దత్తత తీసుకోవాలని 'శ్రీమంతుడు', పర్యావరణ పరిరక్షణ విషయం గురించి చెబుతూ 'జనతాగ్యారేజ్' లను తీసిన కొరటాల శివకి రచయితగా, దర్శకుడిగా ఇలాంటి మెసేజ్ చిత్రాలే హ్యాట్రిక్‌ని అందించాయి.
దాంతో ఆయన ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉండాలి? అనే పాయింట్‌తో ఓ మంచి భావాలున్న యంగ్ సీఎంగా మహేష్‌బాబుని చూపిస్తూ 'భరత్ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. కొన్ని యాక్షన్ సీన్స్, కొంత టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇక మహేష్ చిత్రాలలో అవసరం ఉన్నా లేకపోయినా ఐటం సాంగ్స్ పేరుతోనే, స్పెషల్‌సాంగ్స్ పేరుతోనో పాటలు కంపల్సరీగా ఉంటాయి. కానీ ఈ చిత్రం మంచి సందేశాత్మక చిత్రం కావడం, సీరియస్‌గా సాగే మూవీ కావడంతో ఈ చిత్రంలో అలాంటి పాటలు వద్దని మహేష్ కొరటాల శివకు గట్టిగా చెప్పాడని తెలుస్తోంది. ఇది మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. ఇలాంటి పాటల వల్ల మాస్ ప్రేక్షకులను ఆకర్షించవచ్చు అనే రొటీన్ ఆలోచనల నుంచి మహేష్, కొరటాల బయటకు రావడం హర్షణీయం.
మరోవైపు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రజనీ, శంకర్, అక్షయ్‌కుమార్‌ల '2.0'లో కూడా ఎలాంటి పాటలు ఉండవని ప్రచారం జరుగుతోంది. 'భరత్ అనే నేను' చిత్రం విడుదల ఏప్రిల్ 27నే అని గట్టిగా చెబుతున్నారు. 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' '2.0'లు కూడా దాదాపు అదే సమయంలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కొరటాలకు ఆస్థాన సంగీత విద్వాంసుడైన దేవిశ్రీ 'భరత్ అనే నేను'కి అదిరిపోయే ట్యూన్స్‌ని రెడీ చేశాడని, ఈ చిత్రం ఆడియో హక్కులను లహరి సంస్థ 2 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం.