ఇటీవల భారీ కాంబినేషన్‌లో వచ్చిన 'స్పైడర్, అజ్ఞాతవాసి' వంటి చిత్రాల ఎఫెక్ట్ తాజాగా రానున్న మహేష్‌బాబు 'భరత్ అనే నేను' బన్నీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా', రామ్‌చరణ్ 'రంగస్థలం 1985'వంటి చిత్రాల బిజినెస్‌పై పడటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అందరి దర్శకుల కంటే రాజమౌళి అంటే అందరికీ ఖచ్చితంగా హిట్ అనే ధీమా ఎక్కువ. త్రివిక్రమ్‌పై ఉన్న ఆ ధీమానే 'అజ్ఞాతవాసి' విషయంలో బయ్యర్లను ముంచేసింది. అయినా రాజమౌళి మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ఆయన త్వరలో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో ఓ భారీ మల్టీస్టారర్‌ని దానయ్య నిర్మాణంలో తీయనున్నాడు. ఈ చిత్రం కథ ఓకే అవ్వగా, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో రాజమౌళి బిజీగా ఉన్నాడు.
మరోవైపు తాజాగా రాజమౌళి ఈ చిత్రం ఖర్చు విషయంలో ఓ రఫ్ ఎస్టిమేషన్‌ని వేసి నిర్మాతకు అందించాడట. దీని ప్రకారం రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల పారితోషికం కాకుండా కేవలం సినిమా బడ్జెటే 90 నుంచి 100కోట్లు అవుతుందనే అంచనాకి రాజమౌళి వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి గతంలో ఏయన్నార్, నాగార్జున కాంబినేషన్‌లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరు ఇద్దరే' అనే టైటిల్‌ని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి నటించిన 'మగధీరుడు' ఫ్లాప్ అయినా 'మగధీర'తో రాజమౌళి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. దాంతో ఏయన్నార్, నాగార్జున నటించిన 'ఇద్దరు ఇద్దరే' చిత్రం డిజాస్టర్ అయినా కూడా అదే టైటిల్‌తో రాజమౌళి ముందుకు వెళ్లనున్నాడని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎలాంటి గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌లకు చోటు లేదట. పక్కా మాస్, యాక్షన్ చిత్రంగా రూపొందే దీనిని 2019 దసరా కానుకగా తెలుగుతో పాటు తమిళం, హిందీలలో కూడా విడుదల చేయనున్నారట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌ల సరసన ఎవరు హీరోయిన్లుగా లక్కీఛాన్స్‌ని కొడతారో వేచిచూడాల్సి ఉంది. ఈ చిత్రం అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుందిట. ఆలోపు రామ్‌చరణ్ బోయపాటి శ్రీను చిత్రం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలను పూర్తి చేసి ఈ చిత్రంలో బిజీ అవుతారు.