పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్‌కి ఏర్పడిన వివాదం మూడు నాలుగు నెలలుగా నాన్‌స్టాప్‌గా సాగుతూనే ఉంది. వాద ప్రతివాదనలు, పరస్పర దూషణలతో వాతావరణం వేడెక్కుతోంది. ఇక ఈ విషయంలో 15వ తేదీ వరకు మౌనంగా ఉండాలని పెద్ద మనిషిలా రచయిత, నిర్మాత, దర్శకుడు కోనవెంకట్ ఎంటర్ అయ్యాడు. తమ్మారెడ్డి వంటి వారే ఇది మా వల్ల కాదని తేల్చేశారు. ఇక కోనవెంకట్ 15వ తేదీ వరకు మౌనంగా ఉండమని ఆదేశించడంతో కత్తి మహేష్ కాస్త జోరు తగ్గించాడు. అయితే పవన్‌కి వ్యతిరేకంగా కత్తిమహేష్ కోనవెంకట్ చెప్పిన 7 వ తేదీ తర్వాత కూడా పలు డిబేట్లలో పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి విద్యార్ధుల మద్దతు మూటగట్టాడు. మరోవైపు పవన్ ఏమో తన అన్నయ్యను ప్రజారాజ్యం సమయంలో మోసం చేసిన వారి మీద కక్ష్య తీర్చుకోవడానికే రాజకీయాలలోకి వచ్చానని చెబుతుంటే, పవన్ అభిమానులు మాత్రం తమ హీరోని అవమానిస్తే కక్ష్య తీర్చుకుంటామని అంటున్నారు. పవన్ కాళ్లకు దణ్ణం పెడితే గానీ తాము వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
ఇక తాజాగా కత్తిమహేష్ కోనవెంకట్‌ను ఉద్దేశించి ఎక్కడ సార్ మీరు..? మీరు చెప్పిన తర్వాత నేను మౌనంగా ఉన్నాను. కానీ పవన్ ఫ్యాన్స్ దుశ్చర్యలు నా నుంచి నా కుటుంబసభ్యులను కూడా టార్గెట్ చేసే దాకా విస్తరించాయి. నేను మౌనంగా ఉన్నా కూడా పవన్ అభిమానులు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి? అని ప్రశ్నించాడు. దానికి కోనవెంకట్ కౌంటర్ ఇస్తూ.. దురదృష్టవశాత్తూ నేను 7 వ తేదీని మౌనంగా ఉండాలని కోరిన తర్వాత కూడా నువ్వు ఛానెళ్ల డిబేట్‌లో పాల్గొన్నావు. విద్యార్ధి సంఘాల మద్దతు కోసం ప్రయత్నించావు. మౌనం అంటే నీ డిక్షనరీలో వేరే అర్ధం ఉందా? అని ప్రశ్నించాడు. మొత్తం మీద 'అజ్ఞాతవాసి' విడుదల సమయంలో గొడవలు ఎందుకుని చాకచక్యంగా కోనవెంకట్ రూపంలో 15వ తేదీ వరకు వెయిట్ చేయమని చెప్పి, ఇప్పుడు కోనవెంకట్‌తో పాటు పెద్ద మనుషులందరూ మౌనంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.