మల్లూవుడ్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో కూడా అయన కళాభవన్ మణి మరణం, తర్వాత నటి భావన మీద హీరో దిలీప్ చేయించాడని భావిస్తున్న కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు, ఇక సురేష్‌గోపి మీద పన్నుల ఎగవేత కేసు, యువ నటుడు సిద్దు మరణం.. తాజాగా అమలాపాల్ విషయం పెద్ద సంచనాలకు కేంద్రంగా మారుతున్నాయి. అమలాపాల్ పుదుచ్చేరిలో లగ్జరీ కారు కొని, కేరళ ప్రభుత్వానికి రావాల్సిన 20లక్షల పన్ను ఎగ్గొట్టిన కేసు పలు రకాల మలుపులు తిరుగుతోంది. కొన్ని విషయాలలో సెలబ్రిటీలుగా ఉండటం ఎంత లాభమో, మరికొన్ని సార్లు అంత నష్టం కూడా చేకూరుస్తాయి. క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తనకు విదేశాలలో ఇచ్చిన కారు బహుమతి మీద టాక్స్ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన సంఘటన నాడు సంచలనంగా మారింది. కేవలం ఐదారులక్షల కోసం పన్ను మినహాయింపు అడగడం కోట్లకు పడగలెత్తిన సచిన్‌కి అవసరమా? అని పలువురు ఆయనపై దుమ్మెత్తి పోశారు.
ఇక అమలాపాల్ విషయానికి వస్తే కారు టాక్స్ కట్టకుండా ఉండేందుకు పుదుచ్చేరిలోని ఓ తప్పుడు దృవీకరణ పత్రంతో ఆమె 20లక్షలు ఎగవేయడంపై ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమలాపాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి అప్పీలు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న తిరువనంతపురం హైకోర్టు ముందు, క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావాలని, తర్వాత బెయిల్ సంగతి ఆలోచించవచ్చని తీర్పు చెప్పడంతో అమలా ఇబ్బందుల్లో పడింది. నిన్నటి వరకు నేను కూడా భారతీయురాలినే.. పుదుచ్చేరిలో కారు కొనడం తప్పెలా అవుతుంది?
దేశవ్యాప్తంగా ఉన్న జీఎస్టీ సమయంలో నేను పుదుచ్చేరిలో కారు కొంటే తప్పెలా అవుతుందని వాదించిన ఆమె చివరకు పోలీసుల ఎదుట తన తప్పుని ఒప్పుకుందని సమాచారం. పోలీసులకి సరెండ్ కాగానే మీడియా ఆమెని మాట్లాడమని కోరగా, కోపంతో ఆమె మీడియాపై ఇంతెత్తున లేచి, మీ వల్లే నేను నేడు దోషిగా మారానని కస్సుబుస్సులాడుతూ వెళ్లిపోయింది. మరి ఈ కేసు తీర్పు ఎలా ఉంటుంది? నేరం అంగీకరించినందు వల్ల జరిమానాతో సరిపెడతారా? లేక జైలుకు పంపుతారా? అనేవి వేచిచూడాల్సివుంది...!