అద్దాల మేడలో ఉన్నవారికే రాళ్ల దెబ్బలు తగులుతాయి. వివాదాల వల్ల సెలబ్రిటీలు తాత్కాలికంగా వార్తల్లో నిలవవచ్చే గానీ అది చివరకు వారికే చేటు చేస్తుంది. అందునా పవన్ ఇప్పుడు కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు.. ఆయన జనసేన అధినేత. ఓ పార్టీకి నాయకుడు. ఇక పవన్ మాట్లాడితే చాలు నా అభిమానులు మంచోళ్లు, ఎవరికి ఇబ్బంది కలిగించరు. కులం వద్దు, డబ్బు పరపతి వంటి పవర్ పాలిటిక్స్ వద్దు. నాది ఏ మతము కాదు.. ఏ కులమూ కాదు.. సామాన్యులకి అండగా నిలబడి ఎవరినైనా సరే ప్రశ్నిస్తాను అని తనను తాను లోకరక్షకునిగా చెబుతుంటాడు.
ఆయనలో ఆ భావాలు ఉన్నాయని ఒప్పుకున్నా కూడా తన వీరాభిమానులను అదుపు చేయలేని నాయకుడు, తాను ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పే ఆయనను మరెవ్వరైనా ప్రశ్నించినా, విమర్శించిన తట్టుకోలేని విధంగా ఆయన ఫ్యాన్స్‌లోని కొందరు తయారవుతున్నారు. ఇది చివరకు జనసేన అంటే రౌడీ మూకా? కాపుల పెత్తందారికి ఈ పార్టీ కేరాఫ్ అడ్రస్సా?అనే అనుమానాలు సామాన్యులలో కలుగుతున్నాయి. పవన్ తాను మంచిని ఎక్కడ ఉన్నా తీసుకుంటానని, ఇంగ్లాండ్ పర్యటనలో కృష్ణా ప్రమాద బాధితుల విషయంలో టిడిపిని సపోర్ట్ చేసిన మీది కూడా బాధ్యతే కదా.. అన్నందుకే ఆ మాట నచ్చి కృష్ణా నది బాధితులను పరామర్శించడానికి వచ్చానని చెబుతున్నాడు. కానీ ఆయన కత్తిమహేష్‌పై జరుగుతున్న ప్రజాస్వామ్యక దాడి విషయంలో స్పందించడం లేదు. దీనిపై కత్తిమహేష్ విరుచుకుపడ్డాడు.
చంద్రబాబు కంటే పవన్ ఏమీ గొప్పోడు కాదని, తన వల్ల జరిగిన అసౌకర్యానికి చంద్రబాబే క్షమాపణలు చెప్పినప్పుడు బాబుకి లేని అడ్డు పవన్‌కే వచ్చిందా?మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా ఎవ్వరూ విమర్శలకు అతీతులు కాదు. ఇది తన ప్రాధమిక హక్కుకి సంబంధించిన విషయమని, కాబట్టి దీనిపై తగ్గేదిలేదని కత్తి మహేష్ స్పష్టం చేశాడు. పవన్.. చంద్రబాబు, మోదీ, జగన్‌ల గురించి మాట్లాడవచ్చు గానీ నేను పవన్ గురించి మాట్లాడితే ఆయన అభిమానులు ఇలా దాడి చేస్తారా? ఇది నా ఒక్కడి సమస్య కాదు.. అందరిదీ... ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కత్తి స్పష్టం చేశాడు.