ఆ మధ్య తన పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, ఆ ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ ఉండటం చూసిన ఓ కేంద్రమంత్రి తానే ట్రాఫిక్‌ని క్లియర్ చేశాడు. మహారాష్ట్ర లో మరో నాయకుడు లారీ ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో తానే ఆ లారీని డ్రైవ్ చేసుకుంటూ పక్కనపెట్టాడు. ఇక విఐపిలు వచ్చినప్పుడు సామాన్యులకు జరిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వాటిని తమ బలానికి నిదర్శనంగా, తమ హోదాకి గర్వకారణగా పలువురు ప్రముఖులు ఫీలవుతుంటారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారాల పట్టీ హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ట్రాఫిక్‌కి ఏర్పడిన తీవ్ర అంతరాయంపై పలువురు మండిపడ్డారు.
తాజాగా ఇలాంటి సంఘటనే ఏపీ సీఎం చంద్రబాబు వల్ల ఓ ప్రయాణికుడికి ఏర్పడింది. సంక్రాంతికి తన సొంత ఊరు నారా వారి పల్లెకి వెళ్లిన చంద్రబాబు తన తల్లిదండ్రుల సమాధుల వద్ద పుష్ఫగుచ్చాలు ఉంచి, శ్రద్దాంజలి ఘటించిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించాడు. దాంతో పోలీసులు రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ని నిలిపివేశారు. దాంతో నవీన్ అనే వ్యక్తి పండగ సందర్భంగా తన సొంత ఊరు వెళ్లుతూ ఇబ్బందులు ఎదురుకావడంతో ఆగ్రహించి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
దీనిని గమనించిన చంద్రబాబు నవీన్ వద్దకు వచ్చి సమస్య ఏమిటో అడిగాడు. పోలీసులు ట్రాఫిక్‌ని ఆపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పిల్లలు పాలు కూడా లేక ఏడుస్తున్నారని, కళ్లు తిరిగి పడిపోయేలా ఉన్నారని ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు.. సారీ అమ్మా..ఇకపై అలా జరగదు. ఎస్పీకి చెబుతాను అని అతడిని సముదాయించాడు. పోలీసులను ట్రాఫిక్‌ని పునరుద్దరించమని ఆదేశించారు. సీఎం వంటి వ్యక్తి ఏ భేషజాలకు పోకుండా ఓ సామాన్యుడికి సారీ చెప్పిన విధానం మాత్రం హాట్ టాపిక్ అయింది. అయినా విఐపిల కంటే ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి అంటారే.. అలా పోలీసుల ఓవర్‌యాక్షనే సామాన్యులకు చిర్రెత్తించే అంశమని చెప్పాలి.