ఇటీవల నటీనటుల ఆత్మహత్యలు, మరణాలు బాగా ఎక్కువయ్యాయి. ఉదయ్‌కిరణ్ వంటి యంగ్ హీరోల నుంచి రంగనాథ్ వంటి సీనియర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీహరి, ఏవీఎస్, ఆహుతి ప్రసాద్, కొండవలస వంటి వారు అకాల మృత్యువు వాత పడుతున్నారు. ఇక తాజాగా ఓ మలయాళ యువ నటుడు గోవా బీచ్‌లో శవమై కనిపించాడు. 'సెకండ్ షో' చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన సిద్దు గోవాకి ఈనెల 12 వ తేదీన వెళ్లాడు. మరి ఆయన సముద్రంలో ప్రమాదవశాత్తు కొట్టుకుని పోయాడో.. లేక తానే ఆత్మహత్య చేసుకున్నాడో? లేక మరెవ్వరైనా హత్య చేశారో మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆయన శవాన్ని ఆయన తల్లి గుర్తుపట్టడంతో అది సిద్దునే అని నిర్దారణ అయింది.
ఇక ఈ విషయంలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పోస్ట్ మార్టం జరిగితే గానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తూ మరణించాడా? ఎవరైనా చంపారా? అనేది తెలియకపోవచ్చు. మరోవైపు సిద్దు నటునిగా ఎంతో ఉత్సాహంగా ఉంటూ సరదాగా, ఎంతో యాక్టివ్‌గా ఉండేవాడని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే తత్వంతో పాటు మంచి నటనా ప్రతిభ ఉన్నవ్యక్తి అని మలయాళ పరిశ్రమలోని పలువురు చెబుతున్నారు. సిద్దు గురించి ఆయన సహనటుడు, మలయాళ హీరో, మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, సిద్దు మరణం నాకు షాకింగ్ కలిగించింది.
'సెకండ్ షో' సినిమా సమయంలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండేవాడు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నానని పేర్కొన్నాడు. సిద్దు మరణ వార్త విన్న మలయాళ ప్రముఖులు ఈ షాక్‌తో తీవ్ర దిగ్భ్రాంతికిలోనై, సంతాప సందేశాలను ప్రకటిస్తున్నారు. మొత్తానికి సినీ పరిశ్రమ మంచి టాలెంట్ ఉన్న ఓ యువ నటుడిని, అతి చిన్న వయసులోనే పోగొట్టుకుంది అనేది మాత్రం వాస్తవం.