ఓ తత్త్వవేత్త తన రచనల్లో యుక్తవయసులో కమ్యూనిజం భావాలు, విప్లవభావాలు లేనివ్యక్తి, నడి వయస్కుడిగా మారిన తర్వాత ఆ విప్లవభావాల నుంచి బయటికి రాని వ్యక్తి ఉంటే అతను మానసికంగా సరైన దారిలో ఎదగడం లేదనేది నిజమని చెబుతాడు. ఇక రాజమౌళి గతంలో చాలా సార్లు తనకు దేవుడు, దెయ్యాలు, గ్రహాలు, ఆత్మల వంటి వాటిపై నమ్మకం లేదని, తాను నాస్తికుడినని ప్రకటించుకున్నాడు. కానీ ఆయన తీసిన 'ఈగ'లో ఆత్మలను చూపించడం, 'బాహుబలి' లో శివ విగ్రహంతో తన భావాలకు, తన వృత్తి భావాలకు చాలా తేడా ఉందని రాజమౌళి నిరూపించుకున్న తీరుని ప్రముఖ నాస్తిక వాద మేధావి బాబు గోగినేని ఈ మధ్య పలు టీవీ ఛానెల్స్‌లో తీవ్రంగా వ్యతిరేకించాడు.
తాజాగా మాత్రం రాజమౌళి విషయంలో వస్తున్న వార్తలను చూస్తుంటే ఆయన దేవుడు, దెయ్యాలు, గ్రహాలు, జ్యోతిష్యం వంటివి నమ్మే స్థితికి వచ్చాడని అర్ధమవుతోంది. ఇప్పటి వరకు రాజమౌళి గ్రహసంచారం అద్భుతంగా, శుక్ర మహాదశలో సాగిందట. ఈ దశలో ఏది పట్టుకున్నా బంగారమే అవుతుందని జ్యోతిష్యం చెబుతుంది. నిజంగా రాజమౌళి విషయంలో ఇప్పటివరకు అదే జరిగింది. కానీ నిన్నటివరకు ఉన్న గ్రహ దశ ఇప్పుడు రాజమౌళికి లేదట. అందుకే గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన శాంతి పూజలు, హోమాలు చేయిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో ఇలాంటి శాంతి పూజలు, హోమాలను చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి వారు కూడా నిర్వహించారు. ఇక రాజమౌళి కూడా జ్యోతిష్యుల మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి తీసిన 'బాహుబలి1, బాహుబలి 2'లో సమయంలో శుక్ర మహాదశ నడిచిందని, ప్రస్తుతం రాజమౌళి ఆ దశనుంచి మరో దశలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలని జ్యోతిష్యులు చెప్పడంతో ప్రస్తుతం రాజమౌళి మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నాడని సమాచారం.