సినిమా వారు రాజకీయాలలోకి వస్తే వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ వల్ల తమ పార్టీల సంస్థాగత ఏర్పాటు, పార్టీని విస్తరించడం కూడా మిగిలిన వారికంటే కాస్త సులభమే అవుతుంది. పైగా తాము నోటి మాటలతో చెప్పలేని భావాలను సినిమా ద్వారా చెప్పి, అందరికీ చేరువ చేసే బలమైన, కీలకమైన సినిమా మాధ్యమం కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆ చిత్రాలు ఎవరికి? ఎంత వరకు ఉపయోపడతాయనే విషయం పక్కనపెడితే ఎమ్జీఆర్ నుంచి ఎన్టీఆర్, చిరంజీవి వరకు అందరూ తమ పొలిటికల్ ఎంట్రీ నేపధ్యంలో సినిమాల ద్వారా తమ సిద్దాంతాలను ప్రజలకు చెప్పిన వారే.
ఎన్టీఆర్ 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు', చిరంజీవి 'ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్'లు ఆ కోవలోకే వస్తాయి ఇక తమిళంలో కూడా ఎమ్జీఆర్, శివాజీగణేషన్‌లు కూడా ముందుగా తమ రాజకీయ విధానాలను, భావాలను సినిమాల ద్వారా చూపించి తర్వాత రాజకీయాలలోకి వచ్చారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లు ఈ విషయంలో విజయం సాధిస్తే శివాజీగణేషన్, చిరంజీలు రాణించలేకపోయారు.
ఇక ప్రస్తుతం రజనీకాంత్‌తో పాటు కమల్ హాసన్ కూడా రాజకీయాలలో చేరడంతో వారు కూడా ఎలక్షన్ల కంటే ముందు రాజకీయ నేపధ్యం ఉన్న చిత్రాలను చేయాలని భావిస్తున్నారు. ఇక కమల్‌హాసన్ ఇప్పటికే 'విశ్వరూపం2' విడుదల చేసి శంకర్ దర్శకత్వంలో తాను అవినీతిపై వదిలిన అద్భుత చిత్రం 'భారతీయుడు'కి సీక్వెల్ చేయనున్నాడు. సో.. చిరంజీవి ఎలా 'ఠాగూర్' చేశాడో కమల్ కూడా అదే అవినీతి అనే కాన్సెప్ట్‌తో రానున్నాడు.
ఇక రజనీ కూడా '2.0, కాలా'ల తర్వాత ఓ రాజకీయ నేపధ్యం ఉండే చిత్రాన్ని చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. 'ముదల్వన్'కి సీక్వెల్‌ని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి కూడా శంకరే దర్శకుడనే ప్రచారం జరుగుతున్నా కూడా ఆయన రంజిత్ పాతో ముందుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.