తెగేదాకా లాగితే ఇద్దరికి ప్రమాదమే. ఇద్దరికే కాదు ఆ ప్రభావం సమాజం మీద కూడా చూపుతుంది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెప్పడంలో తప్పులేదు. కానీ తనని విమర్శించే వారందరికీ తిరిగి కౌంటర్లు వేయాలని, అందరికి బుద్ది చెప్పాలనే ప్రయత్నం.. నువ్వు ఒక విమర్శ చేస్తే నేను రెండు చేస్తాను... తమలపాకుతో తానిట్టంటే.. తలుపుచెక్కతో నేనిట్టంటాను అనే ధోరణి సరికాదు. విమర్శలు చేసినా వాటిపై వచ్చే ప్రతి విమర్శలకు కూడా సిద్దపడాల్సివుంటుంది. ఈ విషయంలో పవన్ అభిమానులు, కత్తి మహేష్ ఇద్దరు తప్పు చేస్తున్నారు. కోనవెంకట్ 15వ తేదీ వరకు వెయిట్ చేయమని చెప్పి, మౌనంగా ఉండాలని కోరినా కూడా రెండు వైపుల నుంచి సరైన స్పందన లేదు.
తాజాగా కత్తి మహేష్‌కి ఉస్మానియా విద్యార్ధులు కూడా మద్దతు తెలపడం, కత్తిని ఏమైనా అంటే పవన్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని తెలంగాణలో తిరగనివ్వం అనే దాకా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కి తోడు నందమూరి ఫ్యాన్స్ కూడా కత్తిపై యుద్దం ప్రకటించారు. ఇక ఇద్దరినీ కూర్చొబెట్టి రాజీ చేసే చాన్స్ కూడా కనిపించడం లేదు. కోన మాటలే విననప్పుడు ఎవరు కూడా పెద్దరికం చేయాలని, పరిష్కరించాలని ఆశించరు. అదే అభిప్రాయాన్ని తెలుగు సినీ పెద్దలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ వ్యక్తం చేశారు.
తాను కత్తిని మౌనంగా ఉండాలని కోరానని, కానీ అతను విననప్పుడు నేనేం చేయగలను? కత్తిని కొట్టమంటారా? లేక పవన్ వద్దకి వెళ్లి స్పందించమని చెప్పమంటారా? కత్తి మహేష్.. పవన్ స్పందించాలని కోరుకున్నాడు. నేను కూడా గతంలో ఎవరినో ఏదో అనే ఉంటాను. అప్పుడు వారు నాపై విరుచుకుపడి ఉంటారు. కానీ వాటన్నింటికీ నేను స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతిస్పందించాలా ? లేదా? అనేది కూడా ఎదుటి వారిపై ఆధారపడి ఉంటుందని కత్తి మహేష్ ఆలోచించడం లేదు. గత మూడు నాలుగు నెలలుగా మౌనంగా ఉండమని చెబుతున్నా ఎవరు వినడం లేదని తమ్మారెడ్డి చెప్పారు. ఇది అక్షరాల సత్యం. ఎవరైనా కాస్త తగ్గి తమ గౌరవాన్ని కాపాడుకోవాల్సివుంది!