పేరు బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ తన పరిచయ చిత్రం 'అల్లుడు శ్రీను' తో అందరికి అల్లుడు శ్రీను గానే గుర్తుండిపోయిన శ్రీనివాస్ ఎంట్రీ ప్రాజెక్ట్ తోపాటు చేసే ప్రతి ప్రాజెక్ట్ కి టాప్ టెక్నిషియన్స్ మరియు ఆర్టిస్టులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు ఆయన తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్. అల్లుడు శ్రీను చిత్రం అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ తన హోమ్ బ్యానర్ లో పని చేయనప్పటికీ అతను చేసే ప్రతి చిత్రానికి ఈ శ్రద్ద అయితే తన తండ్రి వైపు నుంచి కనిపిస్తుంటుంది. వి.వి.వినాయక్, భీమినేని శ్రీనివాస రావు, బోయపాటి శ్రీను వంటి పేరు మోసిన డైరెక్టర్స్ తో పని చేయటంతో పాటు అల్లుడుగారితో తెరని పంచుకున్న సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు శ్రీనివాస్ తో ఆడిపాడిన తమన్నా ఇలా అందరూ టాప్ హీరోయిన్స్ కావటం విశేషం.
ఇప్పటి వరకు విడుదలైన బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు మూడింటిలో పంపిణీదారులు లాభాలు చూసిన చిత్రాలు ఏమి లేవు కానీ ఇమేజ్ లేని కొత్త హీరో అయినప్పటికీ కొంత మంది సీనియర్ హీరోల క్లోజింగ్ షేర్స్ ని రాబట్టగలిగాడు శ్రీనివాస్. అయితే టాప్ డైరెక్టర్స్ సినిమాలు కావటంతో ఈ బాక్సాఫీస్ క్రెడిబిలిటీ వస్తుందనే వాదన కూడా బలంగానే వుంది.
ప్రస్తుతం శ్రీవాస్ తో పని చేస్తున్న శ్రీనివాస్ తన తదుపరి చిత్రంగా రాజు గారి గది చిత్రంతో డైరెక్టర్ గా మారిన బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో ఒక కథని ఓకే చేసినట్టు సమాచారం. ఒక మెట్టు తగ్గి ఫేమ్ లేని దర్శకులతో సినిమాలు చేయటానికి ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కి ఉన్న బాక్సాఫీస్ క్రెడిబిలిటీ ఏంటో సమీప భవిష్యత్ లో తెలియనుందన్న మాట.