సాధారణంగా కొందరు నటులు తమ మొదటి చిత్రాల ద్వారా పాపులర్ అయి ఆపేరునే తమ ఇంటిపేరుగా మార్చుకుంటారు. మరికొందరు తమ పేరును ఓ వ్యక్తిత్వానికో, ఒక శరీర ఆకృతితో పర్యాయపదంగా మారుతుంటారు. అలాంటి వారిలో రమణారెడ్డి, మాడలను చెప్పుకోవాలి. ఎవడైనా తేడాగా కనిపిస్తే 'మాడా'లా ఉన్నాడని, సన్నగా, పొడువుగా,రివాటుగా కనిపిస్తే రమణారెడ్డిలా ఉన్నాడే అని అంటూ ఉంటాం. ఇక ఈ విషయంలో మరో మహానుభావురాలు ఉంది. ఆమె సూర్యకాంతం అత్త. ఎంతో సౌమ్యురాలైన ఈమె గయ్యాళి అత్తలకు నేటికి పర్యాయపదంగా మారుతోంది. ఇక కొన్ని చిత్రాలలో విఫలమైన ప్రేమికులను 'మజ్ను' అని, విఫలప్రేమికులై వ్యసనాలకు బానిస అయిన వారిని 'దేవదాసు' అని వాడుతుంటాం. ఇలాంటి పేర్లతో ఓ చిత్రంలోని పాత్ర చేయాలన్నా, లేక ఇలాంటి టైటిల్స్‌ని సినిమాలకు పెట్టాలన్నా ఆచితూచి ఆలోచించడం బెటర్.
గతంలో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రంలో హీరోయిన్ పేరు సూర్యకాంతం. దాంతో ఆ క్యారెక్టర్‌పై ఆమె పేరు ప్రభావం బాగా పడింది. ఇప్పుడు అదే విధమైన సాహసాన్ని మెగా డాటర్ కొణిదెల నిహారిక చేయనుంది. మెగా ఫ్యామిలీ నుంచి వారసురాలిగా అడుగుపెట్టి పలు రియాల్టీ షోలు, వెబ్‌సిరీస్‌లతో ఈమె మెప్పించింది. ఇక ఈమె హీరోయిన్‌గా నటించిన 'ఒక మనసు' చిత్రం మాత్రం రిజల్ట్‌లో తేడా వచ్చింది. దానికి కేవలం మెగా వీరాభిమానుల నుంచి కాస్త ప్రతిఘటన రావడం కూడా ఓ కారణమేనని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇందులో మహారాణి గెటప్‌తో పాటు మోడ్రన్ గెటప్‌లో కూడా కనిపించనుంది. ఇక ఈమె సుమంత్ అశ్విన్‌హీరోగా నటిస్తున్న 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది.
ఈమె తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం టైటిల్ 'సూర్యకాంతం'కాగా, ఇందులో ఆమె టైటిల్‌రోల్‌ని పోషించనుంది. గతంలో 'ముద్దపప్పు ఆవకాయ' వెబ్‌సిరీస్‌కి దర్శకత్వం వహించిన ప్రణీత్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్ అరుణ్-కాళిదాసులు హీరోలుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కేవలం ఇక నాగబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే ఆలస్యం.. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఈమె తమిళంలో నటించే చిత్రంతో పాటు 'హ్యాపీ వెడ్డింగ్' కూడా మంచి ఫలితాలను రాబడితే ఈ చిత్రానికి తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజ్‌రావడం ఖాయం.
మరోవైపు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న నాగబాబు బన్నీ చొరవతో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'కి నిర్మాణ భాగస్వామిగా ఉండటం, మరోవైపు ఆయన తనయుడు 'ఫిదా'తో హిట్ కొట్టి, 'తొలిప్రేమ'పై నమ్మకాలు పెంచుకుంటూ బిజీ అవుతుండటం, మరోవైపు నిహారిక కూడా వరస చిత్రాలను లైన్‌లో పెడుతుండటం చూస్తే నాగబాబు ఆర్దికంగా కాస్త రిలాక్స్‌గా ఫీలయ్యే అవకాశం ఉందనే చెప్పాలి.