ఇటీవల వపన్‌కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవడం చూసి 'భలే...భలే రాజకీయాలు ఇలాగే ఉంటాయి కాబోలు.. పవన్ కూడా ఫక్తు రాజకీయ నాయకునిగా మారిపోయాడని అందరూ భావించారు'. ఇక తన 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల నేపధ్యంలో ఆయన కేసీఆర్‌ని కలవడంతో టిఆర్‌ఎస్ వ్యతిరేక పక్షాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి వచ్చిన పచ్చజెండా వాసి రేవంత్‌రెడ్డి పవన్‌పై విరుచుకుపడ్డాడు. కేసీఆర్ అవినీతికి పవన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారే అవకాశం ఉందని ఆయన తన పార్టీ ఉద్దేశాన్ని నాడే చెప్పాడు. మరోవైపు తెలంగాణలో కూడా కాపు ఓట్లు బాగా కీలకంగా ఉన్నాయని కాబట్టే కేసీఆర్ పవన్‌కి అంతలా ప్రాధాన్యం ఇస్తున్నాడని కూడా నాడే టాక్ మొదలైంది.
మరోవైపు ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణలు మాత్రమే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలవడం కూడా తమ చిత్రానికి స్పెషల్ షోలు, టిక్కెట్ల రేటు పెంచుకోవడానికే అనే టాక్ కూడా వచ్చింది. ఇక పవన్ మాత్రం మంత్రి తలసానిని కలవలేదు. దీని బట్టి పవన్ కేవలం సీఎం వ్యక్తులైన చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్ వంటి పెద్దలతోనే గానీ ఆఫ్ట్రాల్ మంత్రితో నేను కలిసేది ఏమిటనే ఉద్దేశ్యంతోనే ఆయన అక్కడికి వెళ్లకపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇక కేవలం టిక్కెట్లు, బెనిఫిట్ షోలకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సాయం అడిగి, తృప్తిపడే రకం కాదు పవన్.
మరో వైపు పవన్ కలవడం, వెంటనే తాను బెనిఫిట్ షోలు వంటి వాటికి పర్మిషన్ ఇస్తే మాత్రం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు బాలయ్య 'జైసింహా' తో పాటు అన్ని చిత్రాలకు అవే ఒత్తిడులు వస్తాయని భావించిన కేసీఆర్ మౌనం వహించాడు. చంద్రబాబులా ఆయన డేర్ చేయలేకపోయాడు. ఇక తాజాగా ఈ చిత్రం విడుదల సమమయంలో అందునా కత్తి మహేష్ గొడవలలో ఉన్న వారికి కత్తిమహేష్‌లానే ఎవరిమీదైనా కస్సునలేచే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు నోరు విప్పాడు. పనిలో పనిగా ముద్రగడ పద్మనాభం కంటే కాపులలో పవన్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని, తెలంగాణలో కూడా కాపు ఓట్లు కీలకంగా మారనున్న నేపధ్యంలోనే పవన్‌కి కేసీఆర్ అంత ప్రాధాన్యం ఇచ్చి, పవన్ మనోడు బాగా చూసుకోండి అంటూ సంకేతాలిచ్చాడని హనుమన్న మండిపడ్డారు.
మొత్తానికి కాపులలో ముద్రగడ కంటే పవనే ఫాలోయింగ్ ఉందని మొదట తేల్చిన వ్యక్తిగా విహెచ్ రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు. విహెచ్ వాదనను కూడా ఖండించలేం. ఎంత బలం ఉన్నా ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో అమూల్యమైనదే. ఇక కాపులకు ప్రతినిధిగా ముద్రగడ కంటే పవన్‌కి ఎక్కువ ఇమేజ్ ఉన్నదని చెప్పడం ద్వారా వీహెచ్ పవన్‌ని విమర్శించినా, ఆయన సామాజిక వర్గం వారికి మాత్రం ఇది వీనులవిందుగా పవన్ సత్తాని చాటే, ఆయనను రాజకీయంగా ఎక్కువ చూపే ప్రయత్నమే జరగడం సంతోషించే పరిణామమేనని చెప్పాలి. మరి పవన్ నాకు కులం, మతం లేవంటాడు. మరి విహెచ్ ఆయన్ను కాపులకు ప్రతినిధిగా పిలవడంపై పవన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది...!