తెలుగులో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నప్పటికీ ఇతర భాషలకి చెందిన హీరోలు మంచి కథలతో వస్తే వీరికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనంగా బహూకరించి పంపుతారు మన ప్రేక్షకులు. అలా గజిని, శివపుత్రుడు వంటి వైవిధ్యమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువైన తమిళ హీరో సూర్య అనతి కాలంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఏర్పరచుకోగలిగాడు. తరువాత తరువాత సూర్య చేసే కథలలో వైవిధ్యం తగ్గిపోయి మన హీరోలు మనకి అందించే కథలతోనే సూర్య కూడా వస్తుండటంతో ప్రేక్షకులు వరుసగా సూర్య చిత్రాలని తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో రాక్షసుడు, సింగం త్రీ వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ.
ఈ సంక్రాంతి పండుగకి మాత్రం మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నప్పటికీ మూస ధోరణిలో సాగే మాస్ అంశాలు కాక ప్రత్యేకమైన కథ, కథనాలతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం గ్యాంగ్ ద్వారా చేస్తున్నాడు సూర్య. తాను ఎంచుకునే వాణిజ్య కథలు వరుసగా బెడిసికొడుతుండటంతో బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన స్పెషల్ చబ్బీస్ చిత్ర కథని నమ్ముకుని రీమేక్ రూపంలో సంక్రాంతికి వస్తున్నాడు. మరి ఈ చిత్రం అయినా సూర్య అభిమానులకి ఊరట కలిపించే చిత్రమై ఈ హీరోకి మార్కెట్ పరమైన పూర్వ వైభవం అందిస్తుందో లేదో చూడాలి.