నాటిరోజుల్లో ఏమో గానీ నేటి రోజుల్లో మాత్రం సాంకేతికత పెరిగిన నేపధ్యంలో ఏ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్, లేదా సంగీతం వంటివి మన చిత్రాల నుంచే కాదు పరభాషా చిత్రాల నుంచి లేదా కొరియన్, ఫ్రెంచ్ ఇలా ఏ భాష నుంచి తీసినా కూడా నెటిజన్లు, అభిమానులు ఈజీగా వాటిని పట్టేస్తున్నారు. ఇలా ఆరోపణలు వచ్చిన ఎక్కువ శాతం చిత్రాలలో ఇది నిజమేనని తేలింది. అల్లు శిరీష్ హీరోగా ఇటీవల విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఒక్కక్షణం' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే వివాదాన్ని పెద్దది చేయకుండా ఓ విదేశీ చిత్రం హక్కులని పొందిన నిర్మాత అనిల్‌సుంకరతో గీతాఆర్ట్స్ కుమ్మక్కు అయి సెటిల్ చేసుకున్నారు. కానీ వెంటనే 'అజ్ఞాతవాసి' చిత్రం విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
ఈ చిత్రం టీజర్ చూసిన వెంటనే కత్తి మహేష్ ఈ చిత్రం ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' కాపీ అని వ్యాఖ్యానించాడు. దీంతో కేవలం టీజర్‌ని చూసి ఎలా చెబుతారని పవన్ అభిమానులు ఆయనపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కానీ తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నేపధ్యంలో 'లార్గో వించ్' జెరోమ్ సాలీ ఈ చిత్రం చూశారు. చూసిన వెంటనే ఆయన ఈ చిత్రం బాగుందని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, అయితే ఈ చిత్రంలో తన చిత్రం పోలికలు ఎక్కువగా కనిపిస్తున్న విషయం బాధని కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు. ఇక ఈ చిత్రం ఇండియన్ రీమేక్ హక్కులను కొనుక్కున్న టిసిరస్ సంస్థ ఇప్పటికే 'అజ్ఞాతవాసి' యూనిట్‌ని, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రం తన చిత్రాన్పే పోలి ఉందని ఒరిజినల్ వెర్షన్ డైరెక్టరే తేల్చిచెప్పడంతో ఇది నిజమేనని పక్కాగా రూఢీ అయింది.
అయినా పవన్ విషయానికి వస్తే ఆయన మరి ఎక్కువగా మన కథలని నమ్మకుండా ఇతర కథలపై, రీమేక్‌లపై, ఫ్రీమేక్‌లపైనే ఆధారపడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా తెలుగులోకి డబ్ అయిన 'వీరం'ని 'కాటమరాయుడు'గా తీయడంతో పాటు ఆయన 'గబ్బర్‌సింగ్, తీన్‌మార్, గోపాల గోపాల'ఇలా వరుసగా పర చిత్రాలనే తీస్తున్నాడు. ఇక 'వేదాళం' నునీసన్‌తో తీయనున్న సంగతి కూడా తెలిసిందే. మరో వైపు చిరంజీవి సైతం తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం, 'కత్తి' రీమేక్ చేయడం, అల్లు శిరీష్ నుంచి అందరూ ఇదే దారిలో నడుస్తుండటంతో వారిపై విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. చిరంజీవి కెరీర్‌ని మార్చిన 'ఖైదీ' నుంచి ఆయన రీమేక్‌లు లేదా యండమూరి నవలలను నమ్ముకునే వాడనే సంగతి తెలిసిందే.