పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25 వ చిత్రం కావటం, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది తరువాత వస్తున్న చిత్రం కావటం, పవన్ కళ్యాణ్ నటనకు స్వస్తి పలకబోతున్నారనే వార్త ప్రచారంలో ఉండటంతో అజ్ఞాతవాసి చిత్రం పవర్ స్టార్ కెరీర్ లో, పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా చాలా కీలకమైన చిత్రంగా నిలిచింది. విడుదలకి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరగటానికి ఈ కారణాలని దోహదపడ్డాయి. అయితే అభిమానులకి నిరాశ మిగిల్చే విధంగా, సామాన్య ప్రేక్షకులకి విరక్తి చెందేలా ఆ చిత్రం ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్ర వసూళ్ల పై ఎన్నో సందేహాలు మొదలయ్యాయి.
జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలని చురుకుగా నిర్వహించటానికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం అనంతరం బ్రేక్ తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రాజకీయాలలో బిజీ అయ్యే ముందు ఇలాంటి వైఫల్యంతో సినిమా కెరీర్ ముగించటం అభిమానులకి మింగుడు పడకపోవచ్చు. ఒకప్పుడు ఇలానే శంకర్ దాదా జిందాబాద్ చిత్ర వైఫల్యం అనంతరం రాజకీయాలలో బిజీ ఐన మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ కెరీర్ దీన స్థితిలో ఉండటంతో అభిమానులు ఆ సెంటిమెంట్ ని కూడా పోల్చుకుని పవర్ స్టార్ పొలిటికల్ కెరీర్ పై కూడా ఆందోళన చెందుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి?