నాగార్జున అటు వ్యాపారంలో అయినా.. ఇటు సినిమాల విషయంలో అయినా ఎంతో కాలిక్యులేటెడ్ గా ఉంటాడనే టాక్ ఉంది. ఏ విషయాన్నైనా ఆచి తూచి అడుగులు వేసే నాగార్జున.. తన రెండో కొడుకు అఖిల్ విషయంలో మాత్రం అతిగా ఆశించి బోర్లాపడ్డాడు. అఖిల్ ని హీరోగా పెట్టి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హలో సినిమా రెండు వారాల క్రితమే విడుదలై మిశ్రమ స్పందనతో పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రమే కొల్లగొట్టి మిగతా సగాన్ని రాబట్టుకోలేక అష్ట కష్టాలు పడుతుంది. అంటే 30 కోట్ల పెట్టుబడికి కేవలం 15 కోట్లు మాత్రమే రాబట్టి హలో సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా విషయంలో నాగార్జున ఎంత చేయాలో అంత చేశాడు. హలో ప్రమోషన్స్ విషయంలోనూ నాగార్జున శక్తికి మించి కష్టపడ్డాడు. ఒకరేంజ్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినా ఆ సినిమా ఫలితం మాత్రం నాగ్ కి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.
ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించిన లోబడ్జెట్ మూవీ రంగులరాట్నం ఈ సంక్రాంతికే విడుదల కాబోతుంది. కేవలం పది రోజుల ముందు అనుకోకుండా సంక్రాంతి బరిలోకి వచ్చిన రాజ్ తరుణ్ హీరోగా నటించిన రంగుల రాట్నం మీద ఎటువంటి క్రేజ్ లేదు. కారణం ఈ సినిమా ప్రమోషన్స్ లో వీక్ గా ఉంది. అసలు నిర్మాత నాగార్జున రంగుల రాట్నం ప్రమోషన్స్ విషయమై పట్టించుకోవడమే లేదు. కొడుకు హలో సినిమాకి చేసిన ప్రమోషన్స్ లో వన్ పెర్సెంట్ కూడా రంగులరాట్నానికి చెయ్యడం లేదు. ఎంత లోబడ్జెట్ పెట్టినా ఇలా కనీసం నాగార్జున ప్రమోట్ చెయ్యకుండా గాలికొదిలెయ్యడం సమంజసంగా లేదు. ఏదో రాజ్ తరుణ్ తో పాటు దర్శకురాలు, హీరోయిన్ చిత్ర శుక్ల మాత్రమే ప్రమోషన్ ఈవెంట్స్ కి హాజరవుతూ హడావిడి చేస్తున్నారు.
అయితే నాగ్ మాత్రం సినిమా విడుదలకు ఒక్క రోజు ముందేమైనా మీడియా మీట్ లో పాల్గొంటాడేమోలే అంటున్నారు. అయితే నాగ్ మీడియా ముందుకు రాకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. హలో సినిమా దెబ్బకి రంగులరాట్నం రైట్స్ ని హలో డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేశాడట నాగ్. ఎలాగూ లోబడ్జెట్ కదా అందుకే ఇలా చెయ్యడమేకాదు.. హలో శాటిలైట్ హక్కులు ఇచ్చిన జీ తెలుగు వారికే రంగుల రాట్నం శాటిలైట్ హక్కులను ఇచ్చేశాడట. అలాగే రంగులరాట్నం ప్రమోషన్స్ కి మీడియా మీట్ లో పాల్గొంటే హలో సినిమా డిజాస్టర్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టే నాగ్ ఇలా రంగులరాట్నం ప్రమోషన్స్ కి రాకుండా సినిమా టీమ్ కే ఆ బాధ్యతలు ఇచ్చాడనే టాక్ ఉంది.