దాదాపుగా మన చిత్ర పరిశ్రమలో విడుదలై భారీ విజయాలు అందుకుంటున్న చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలకి పలానా భాష చిత్ర కథ స్ఫూర్తి అని, లేదా పలానా భాష చిత్రానికి మక్కికి మక్కి కాపీ అని రకరకాల కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రకమైన వాదోపవాదాలు ప్రతి దర్శక రచయితకి తల వంపులు తీసుకురావటం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితే అసలు సినిమా విడుదల కాకముందే ఎదురైతే?? ఇప్పుడు ఇంచు మించుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది.
అజ్ఞాతవాసి చిత్ర కథ పూర్తిగా ఒక ఫ్రెంచ్ చిత్ర కథకి కాపీ అనే వాదన బలంగా వినిపిస్తుంది. మరోవైపు ఆ ఫ్రెంచ్ చిత్ర రీమేక్ హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ వద్ద ఉండటం పెద్ద దుమారానికి దారి తీసింది. అందుచేతనే ముందుగా కట్ చేసిన ట్రైలర్ ని ఆపి కథ ఎంత మాత్రం బైటకి తెలియని విధంగా మరో కొత్త ట్రైలర్ కట్ చేసి ఆలస్యంగా విడుదల చేశారు హారిక హాసిని క్రియేషన్స్ వారు. ఒక వైపు పెయిడ్ ప్రీమియర్స్, ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ అన్నిటికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నా దర్శకుడు, చిత్ర కథా రచయిత త్రివిక్రమ్ మీడియా ముందుకు వచ్చి ప్రమోషనల్ ఇంటర్వూస్ ఇవ్వకపోవటానికి గల కారణం తాను అజ్ఞాతవాసి చిత్ర కథని కాపీ కొట్టటమే అని గుసగుసలు వినపడుతున్నాయి. సినిమా ప్రొమోషన్స్ అని బైటకి వచ్చాక మీడియా వారు సంధించే ప్రశ్నలకి సమాధానం లేకనే త్రివిక్రమ్ ఎవరికీ అందకుండా తిరుగుతున్నాడనే సందేహాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ కాపీ చట్ విషయమై స్పష్టత మరి కొన్ని గంటలలో అజ్ఞాతవాసి తొలి షో ప్రదర్శనతో వచ్చే అవకాశం ఉంది.