అయినా ఎవరి మనోభావాలు వారివి. ఇక్కడ కత్తి మహేష్ ఒక విషయం మర్చిపోయాడు. తాంత్రిక పూజలను పవన్, త్రివిక్రమ్‌లు చేశారని ఆయన చేసిన ఆరోపణ తీవ్రమైంది. నిజానికి ఇలాంటి పెద్ద విషయాన్ని కత్తిమహేష్ ఆరోపించి, దానిని ప్రూవ్ చేయలేకపోతే ఆయన తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ ఆయన పవన్, త్రివిక్రమ్‌లు తాంత్రిక పూజలు చేశారని, ఆ పూజలు జరిపించి పూజారీ పేరు నరసింహ అని తెలిపాడు. తానే ఓ జర్నలిస్ట్ అయి ఉండి దీనిపై కూపీలాగాలని ఆయనే మీడియాను కోరడం విడ్డూరం, మరో వైపు దానికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు. ఇంత వరకు కత్తి మహేష్‌కి కాస్తో కూస్తో సమర్ధించే వారికి కూడా ఈ విషయంలో కత్తి మీద ఆగ్రహం రాకమానదు.
నేడు కూడా సమాజంలో ప్రతి ఊరికి గ్రామదేవతలు ఉంటారు. భక్తులు వచ్చి వాటికి పూజలు, కోళ్లు, గొర్రెల వంటి వాటిని బలి కూడా ఇస్తుంటారు. దీనిపై ఆయన పోరాడదలుచుకుంటే అందరిపై పోరాడాలి కానీ ఎవరో ఒకరి మీదనే కాదు. అందరికీ తెలిసి పవన్, త్రివిక్రమ్‌లు ఆ పని చేశారంటే ఎవ్వరూ నమ్మరు. నాన్‌వెజ్ కూడా ముట్టని త్రివిక్రమ్ బలులు, తాంత్రిక పూజలు చేశారంటే నమ్మబుద్ది కాని విషయం మరి పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కత్తిమహేష్‌కి కూడా కనిపిస్తోందా? అనే అనుమానం వస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం పవన్-త్రివిక్రమ్‌లు పూజలు నిర్వహించింది పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలో ఉన్న నరసింహాస్వామికి. త్రివిక్రమ్‌కి ఈ గుడి, దేవుడు, ఇక్కడ మహాశివరాత్రి నాడు జరిగే సుదర్శన యాగాలంటే నమ్మకం. ఆయన ప్రతి ఏడాది అక్కడ సుదర్శన యాగం జరిపించి పూజలు చేస్తారు. ఆ సమయంలో తాను ఏ సినిమా తీస్తుంటే అందులోని ప్రముఖులను ఆ కార్యక్రమానికి త్రివిక్రమ్ ఆహ్వానిస్తాడు. గతంలో కూడా పవన్, సునీల్ వంటి వారు త్రివిక్రమ్‌తో కలిసి ఈ యాగాలలో పాలు పంచుకున్నారు. కేవలం వీరే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ దేవాలయాలను సందర్శించి, ఈ యాగంలో పాల్గొంటారు. మరి ఈ విషయం కత్తికి తెలియదా?
నరసింహస్వామి ఉగ్రస్వరూపుడు కనుక పూజలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాటిని చూసి తాంత్రిక పూజలని కత్తిమహేష్ పొరబడినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు చట్టాలకు ఇబ్బందులు లేకుండా చేసుకున్న కత్తి మహేష్ క్షుద్రపూజలు, పవన్, త్రివిక్రమ్‌లని దానిలోకి లాగడం, మరోవైపు పూనమ్ కౌర్ విషయంలో హద్దు దాటి వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈయన మాటలు పరువు నష్టం దావా కిందకి, ఇతరులపై తప్పుడు ఆరోపణలతో టార్గెట్ చేయడం కిందకి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. పవన్ అభిమానులు ఈ విధంగా ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే మంచిది.