నిజంగా చెప్పాలంటే వివాదాస్పద బయోపిక్‌లు తీసేంత స్థాయి తెలుగుదర్శకులకు లేదు. రాంగోపాల్‌వర్మ మాత్రమే దానికి మినహాయింపు. ఇక మన వారంతా ఎవరికి నచ్చినవారిని వారు దేవుళ్లుగా చూపిస్తారే గానీ వివాదాల జోలికి వెళ్లరు. ఈ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే ముందుంటారు. ఎంతటి వివాదాన్ని అయినా తమదైన శైలిలో చూపించి మెప్పిస్తారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్-లక్ష్మిపార్వతిల జీవితాలపై ఇప్పటికీ మూడు బయోపిక్‌లను ప్రకటించారు. బాలయ్య తన తండ్రిపై తేజ దర్శకత్వంలో తీసే బాలయ్సాస్ ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి కాగా.. వర్మ అనౌన్స్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్', కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తీస్తానని చెప్పిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' బయోపిక్‌లు. వీటిల్లో బాలయ్య బయోపిక్ మాత్రం ఖచ్చితమనే చెప్పాలి. ఆల్‌రెడీ టీజర్‌ని కూడా తీసి ఎన్టీఆర్ వర్ధంతిన విడుదల చేయనున్నారు.
ఇక మిగిలిన రెండు బయోపిక్‌లపై వర్మ, కేతిరెడ్డిలు మాట్లాడి చాలా కాలమే అయింది. వర్మ ప్రస్తుతం నాగార్జున చిత్రంతో బిజీగా ఉన్నాడు. కేతిరెడ్డి ఆ విషయమే మాట్లాడటం మానివేశాడు. ఇక బాలయ్య బయోపిక్ విషయంలో గతంలో ఆయన్ను విలేకరులు ప్రశ్నించిననప్పుడు ఈ సినిమా కథని ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో నాకు తెలుసు. ఎవరి సలహాలు అవసరం లేదని బాలయ్య మండిపడ్డాడు. దాంతో ఎన్టీఆర్ జననం నుంచి మొదటి సారి సీఎం కావడం, లక్ష్మీపార్వతి ఎంటర్ కాకముందు వరకే ఈ చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు చూపాలంటే దానికి గట్స్ కావాలి. వాటిని ప్రజలు నిజమని నమ్మేలా తీయాలి. ఎలాగూ లక్ష్మీప్వార్వతిని మంచిగా చూపే పని బాలయ్య చేయబోడు. అలాగని పూర్తిగా చెడుగా చూపించినా ఇబ్బందులు వస్తాయి.
నాడు చంద్రబాబు చేసింది తప్పా? కాదా? అనే విషయంలో జనాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాత్రం చంద్రబాబుని జామాత దశమగ్రహం అని, వైస్రాయ్ ఎపిసోడ్, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బోలెడు ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు తనని వెన్ను పోటు పొడిచాడని మాత్రమే భావించాడు తప్ప తన భార్య లక్ష్మీపార్వతిది తప్పు అని చెప్పలేదు. మరి అలాంటి ఎన్టీఆర్ మనోభావాలు అందరికీ తెలుసు. సో... ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తూ ఆయన భావాలను చూపించలేని పరిస్థితి తలెత్తేలా తీస్తారని భావించడం జరగని పని. మరోవైపు వైఎస్సార్ బయోపిక్ కూడా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు ఎన్నికలనే టార్గెట్ చేస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.