పవన్-త్రివిక్రమ్‌ల 'అజ్ఞాతవాసి' చిత్రంపై ఇది ఓ ఫ్రెంచ్ చిత్రం రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీని కోసం ఈ హక్కులు పొందిన టిసిరీస్ సంస్థతో 'అజ్ఞాతవాసి'టీం రానా ద్వారా సంప్రదింపులు జరుపుతోందని, నిజంగానే ఇది రీమేక్ కావడంతో 15కోట్లు టిసిరిస్ సంస్థలకు చెల్లించారని వార్తలు వచ్చాయి. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. పవన్ 'వీరం'ని రీమేక్ చేసి దెబ్బతిన్నాడు. ఆ వెంటనే ఆయన మరో రీమేక్‌ని నమ్ముకునే అవకాశం లేదు. ఇక త్రివిక్రమ్ స్టైల్ తెలిసిన వారు కూడా ఆయన మక్కీకి మక్కీ కాపీ కొడతాడని ఎవ్వరూ భావించరు. ప్రతి సినిమా కథని, సీన్స్‌కి తనదైన ట్రీట్‌మెంట్, డైలాగ్స్ వంటి వాటితో తెలుగుదనంని అద్దడం ఎలాగో ఇప్పుడున్న డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్‌కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. పూరీ అయినా ఈ విషయంలో దొరుకుతాడేమో గానీ త్రివిక్రమ్ దొరికే ఛాన్స్ కూడా లేదు.
మరోవైపు 'జాలీ ఎల్‌ఎల్‌బి' వంటి చిత్రానికి ముందస్తుగా బాలీవుడ్ రైట్స్ కొన్న త్రివిక్రమ్ ఇలాంటి తొందరపాటు పని చేయడు. చేసినా ఎవ్వరికీ చిక్కకుండానే చేస్తాడు. మక్కీకి మక్కీ దింపే అలవాటు ఆయనకు లేదు. ఇక వరుసగా ఎన్ని సీన్స్‌ని తీసినా, తనదైనశైలిలో మద్యలో ఒక్క సీన్ చూపిస్తే అది కాపీ కిందకి రాదు. శ్రీమంతుడు, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల విషయంలోనే ఏమి చేయలేకపోయిన వారు ఇప్పుడేమీ చేయలేరు. మన కాపీ రైట్ చట్టం ఎంత బలిష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు.
చారిత్రక కథలనే తమ ఇష్టమొచ్చినట్లు మార్చి, ఇది కల్పితం, ఎవరినీ ఉద్దేశించింది కాదు అంటే సరి..అన్నింటికి అదే సమాధానం అవుతుంది. ఫ్రీడమ్‌ఆఫ్ స్వీచ్ ఉన్నట్టే ఫ్రీడమ్ ఆఫ్ కాపీ కూడా మన పేటెంట్ హక్కు. అయినా ఆ ఫ్రెంచ్ చిత్రం హక్కులను టీసిరీస్ సొంతం చేసుకుని ఉండి. ఈ చిత్రం దానికి కాపీనే అయినా ఏదో ఫ్రెంచ్ చిత్రానికి, అందునా ఓ ప్రాంతీయ భాషలో 15కోట్లు చెల్లించేంత అమాయకులెవ్వరూ లేరు. సో.. ఈ వార్తలో పెద్దగా నిజం లేదని, స్ఫూర్తి అయితే అయి ఉండవచ్చు గానీ ఈ విషయంలో నిర్మాత పది పైసలు కూడా పెట్టేంత అమాయకులు కాదని చెప్పవచ్చు.