గతంలో బాలయ్య చిత్రాలలో తన వంశం, తండ్రి, సైకిల్ వంటి పదాలు వినిపించేవి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా 'కంత్రి' చిత్రంలో సైకిల్‌పై ఇక ఎవడు రాడనుకున్నారా? రాలేడనుకున్నాడా? సైకిల్‌కి ఉన్న పవర్ ఇది అని ఏవేవో డైలాగ్స్ కొట్టాడు. చివరకు ఆ సినిమాకి పంచరైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం థియేటికల్ ట్రైలర్‌లో కూడా మురళీశర్మ 'మళ్లీ సైకిలెక్కుతాడా.. వర్మా' అని అంటే 'వాడు ఏది ఎక్కినా ఫర్లేదు. మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు'అని రావురమేష్ చేత డైలాగ్ చెప్పించారు.
ఇక ఈచిత్రం ట్రైలర్ మాత్రం మాంచి కిక్ ఇస్తోంది. పవన్ తరహా మేనరిజమ్స్, త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు 'అజ్ఞాతవాసి'కి రెండు రోజుల గ్యాప్‌లో వచ్చే బాలయ్య 'జై సింహా'లోకూడా బోలెడు పొలిటికల్ సెటైర్స్, డైలాగ్స్, సీన్స్ ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. అదే సమయంలో 'అజ్ఞాతవాసి'లో కూడా సైకిల్‌పై చర్చ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక 'జైసింహా'లో బాలయ్య డైరెక్ట్‌గానే పొలిటికల్ డైలాగ్స్ వాడితే. 'అజ్ఞాతవాసి'లో మాత్రం సింబాలిక్‌గా సైకిల్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. 'మరలా సైకిల్ ఎక్కుతాడా? అంటే టిడిపితో జతకడుతాడా? అనే అర్ధం వస్తే, 'ఏది ఎక్కినా ఫర్లేదు.. మనల్ని ఎక్కకుండా ఉంటే అదే చాలు' అనేడైలాగ్ ద్వారా మాత్రం ఇంకా పూర్తిగా పవన్ రాజకీయంగా ఓ నిర్ణయానికి రాలేదని అర్ధమవుతోంది.
మొత్తానికి ఈ రెండు చిత్రాలలో కూడా ఎక్కువగా జగన్‌ని టార్గెట్ చేసిన డైలాగ్సే ఉన్నాయని తెలుస్తోంది. మరి పవన్ ఈసారి 'సింహంలా సింగిల్‌గా వస్తాడో.. లేక సైకిల్‌పై దూసుకొస్తాడో అన్నది మాత్రం రాజకీయాలు ముదిరి పాకాన పడే దాకా తేలవు. రాజకీయాలలో ఎప్పుడు ఏది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పవన్‌కి వచ్చే ఎన్నికల లోపు ఇదే చివరి చిత్రం అని వార్తలు వస్తుండటంతో తన సినిమా తన పొలిటికల్ మైలేజ్‌కి ఉపయోగపడేలా ఉంటుందా? లేదా అనే సందేహం ఉండేది. మొత్తానికి 'అజ్ఞాతవాసి'తో పవన్ పొలిటికల్ పంచ్‌లు కూడా పేల్చి ఆశ్చర్యపరచడం ఖాయమనే అంటున్నారు...!