వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకేమీ ఇబ్బంది లేదు. అది ఖచ్చితంగా వియ్యంకుడు, బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రిగా ఉన్న బాలయ్యకి బాగా వర్తిస్తుంది. అయినా ఒక విధంగా చూసుకుంటే మాత్రం బాలయ్య మంచి పని చేస్తున్నాడనే చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందా? ఏపీలోని అమరావతి, వైజాగ్‌లకు వస్తుందా? అనే ప్రశ్న మొదట్లో ఉండేది. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం మన సిని ప్రముఖులను బాగా 'చూసుకుంటూ ఉండటం'తో ఇండస్ట్రీ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటుందని ఖచ్చితంగా అందరూ నమ్మారు.
మరోవైపు చంద్రబాబుకి సినిమా గ్లామర్ అంటే మహామోజు. ఆయన బోయపాటి, రాజమౌళిలకు వేసిన పెద్ద పీట చూసి ఆయన ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి ఏపీకి తెప్పిస్తాడేమోనని పలువురు భావించారు. గంటా శ్రీనివాసరావు కూడా ఇండస్ట్రీ ఏపీకి వస్తుందని చెబుతూ వచ్చాడు. ఇక చిరంజీవి, అల్లుఅరవింద్, పవన్‌కళ్యాణ్, సురేష్‌బాబు వంటి వ్యక్తులు విశాఖ, అమరావతితో పాటు చెన్నైకి సమీపంలో ఉండే నెల్లూరు జిల్లాకి, తమిళనాడు రాష్ట్రానికి బోర్డర్ అయిన తడలో కూడా స్టూడియోలు కడతారని వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య దానిపై భ్రమలు తొలగిపోయాయి. ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఇండస్ట్రీ ఏపీకి రావడం బహుశా ప్రభుత్వానికి ఇష్టం లేదని, వారికి లేకుంటే తమకు అంత అవసరం ఏమిటి? అని ప్రశ్నించాడు.
ఇక తాజాగా బాలకృష్ణ తాను కొత్తగా ఏర్పడిన ఏపీలో స్టూడియో కడతానని తేల్చిచెప్పాడు. దీని విధివిధానాలు ఆరునెలల్లో తెలుపుతామన్నాడు. ఇక బాలయ్య తలుచుకోవాలే గానీ ఆయనకు సచివాలయం రాసిమన్నా మన బాబు రాసిస్తాడు. సో.. బాలయ్య ఎక్కడ కోరుకుంటే అక్కడ.. ఎంత కావాలంటే అంత స్థలం సిద్దం అయిపోతుంది. మరోవైపు ఎలాగూ హైదరాబాద్‌లో దేనికి ఉపయోగించకపోయినా తమ సొంత ఆస్థిలా భావించే రామకృష్ణా స్టూడియో ఉంది. ఇక బాలయ్య త్వరగా నిర్మాతగా మారడంతో పాటు ఏపీలో కూడా స్టూడియో కట్టి మన కలలు నెరవేర్చడం ఖాయం.