అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'భాగమతి' చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుని సంవత్సరాలు గడిచిపోయాయి. గత నెలలో ఫస్ట్ లుక్ తో సినిమా జనవరి 26 న రిపబ్లిక్ డే రోజున 'భాగమతి' విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనుష్క బాహుబలిలో నటించిన తర్వాత వస్తున్న చారిత్రాత్మక చిత్రం కాబట్టి 'భాగమతి' చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న భాగమతి చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం.
'భాగమతి' ట్రైలర్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఒక అంచనాకి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. అనుష్క ఈ సినిమాలో ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారిణిగా కనబడబోతోంది. ఒక ఊరికి మేలు జరిగే క్రమంలో కొంతమంది రాజకీయకులకు టార్గెట్ అవుతుంది చంచల ఐఏఎస్. అందుకే ఆ రాజకీయ నాయకులూ ఈ సిన్సియర్ అధికారిణిని ఒక మర్డర్ కేసులో జైలుకి పంపించడమే కాదు... అందులో భాగంగా అనుష్కని ఒక పాడుబడిన మహల్ కి పంపగా... అక్కడ కొన్ని విచిత్ర పరిణామాలు చోటుచేసుకోగా... నన్ను అక్కడినుండి పంపేయమంటూనే దొరికిన వారిని దొరికనట్టు కొట్టేస్తూ.... తనకి తానే శిలువ వేసుకుంటూ కనబడుతుంది అనుష్క... మరొక పాత్ర మాత్రం అరుంధతి లెవల్లో కనబడుతుంది. అలా అరుంధతి లెవల్లో కనబడుతున్న భాగమతి అనుష్క... 'ఉగ్ర రూపంతో ఎప్పుడు బడితే అప్పుడు రావడానికి.. ఎప్పుడు బడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అంటూ చెప్పే డైలాగు మాత్రం ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో పరిచయం చేసింది.
ఇక భాగమతికి సంగీతం అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ మాత్రం ఎప్పటిలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. అరుంధతి, బాహుబలి మాదిరిగానే అనుష్క ఈ భాగమతితో మరోమారు బ్లాక్ బస్టర్ ని మాత్రం ఖచ్చితంగా అందుకుంటుందంటున్నారు.