దేనికైనా ఓ హద్దు ఉంటుంది. దానిని దాటితే మాత్రం ఎవ్వరూ ఊపేక్షించకూడదు. కత్తిమహేష్, పపన్ ఫ్యాన్స్ వ్యవహారంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ ఇద్దరి మధ్య జరగాల్సిన వాదవివాదాలలో ఇతరులు తలదూరుస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ తీరుని మాత్రం తప్పుపట్టాల్సిందే. కత్తిమహేష్ పవన్‌పై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రోడ్డు మీద తిరిగితే కొడతామని, చంపేస్తామని పవన్‌కళ్యాణ్ యూత్ ఫ్యాన్స్ విజయవాడ అధ్యక్షుడు రమేష్‌కుమార్ మీడియాసమక్షంలోనే హెచ్చరికలు చేయడాన్ని మనం ఎలా సమర్దించాలి? తమ వాదన వినిపించడంలో తప్పు లేదు. కానీ అసభ్యపదజాలం, దూషణలు, భౌతికదాడులకు దిగుతామని చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు వివాదంలోకి పూనమ్‌కౌర్, వేణుమాధవ్ వంటి వారు ఎంటర్ కావడం మంచి పనికాదు. ఇద్దరిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న కోనవెంకట్‌ని ఆదర్శంగా తీసుకోవాలి గానీ ఏదో మధ్యలో వచ్చి అగ్నికి మరింత ఆజ్యం పోయడం సరికాదు.
ఇక కత్తిమహేష్ జర్నలిస్ట్, దళితుడైనంత మాత్రాన ఆయనేమీ చట్టాలకు, రాజ్యాంగానికి అతీతుడు కాదు. ఆయన అసలు దళిత కార్డుని ఈ వివాదంలోకి తేవడమే పెద్ద తప్పు. ఇక పవన్, త్రివిక్రమ్‌లు క్షుద్రపూజలు చేశారని ఆయన ఆరోపించడం చూస్తే పిచ్చి నషాలానికి ఎక్కినట్లుగా ఉంది. మరి జర్నలిస్ట్ అన్న తర్వాత ఆనాడు నేను లేను. నాకు తెలియదు అని తప్పించుకోవడానికి వీలులేదు. మనం పుట్టకముందు చరిత్ర కూడా జర్నలిస్ట్‌లు తెలుసుకుని ఉండాలి. స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, పదవి కోల్పోయినప్పుడు క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు, నగ్నంగా పూజలు చేసేవాడని పలు మీడియాలలో నాడు ఎన్నో కథనాలువచ్చాయి. పింగళి దశరథరామ్‌తో పాటు కాగడాశర్మ వంటివారు ఎండగట్టారు. ఇక నాడు ఈ వార్త ఎంతో హల్‌చల్ చేసింది. ఇక వైఎస్‌జగన్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు కూడా ఇడుపులపాయ చర్చిలో బ్రదర్ అనిల్‌తో కలిసి ఏవేవో ఇలాంటి మూఢనమ్మకాలను బలపరిచే పనులు చేశారని వార్తలు వచ్చాయి. మరో వైపు బాలకృష్ణ విషయం అందరికీ తెలిసిందే.
ఇలాంటి వాటిపై పోరాడాలని భావించినప్పుడు అందరిని సమదృష్టితో చూసి, వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత, ఇలాంటి మూఢనమ్మకాలపై పోరాటం చేయడం కత్తి మహేష్ బాధ్యత కానీ ఆయన కేవలం పవన్, త్రివిక్రమ్‌లనే టార్గెట్ చేస్తుంటే మాత్రం పలు అనుమానాలు రేగుతున్నాయి. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని ఖచ్చితంగా చెప్పే ధైర్యం కత్తి మహేష్‌కి ఎందుకు లేదు? ఇక తాను మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు తప్పయితే తనని ఇప్పటికే జైలులో పెట్టించేవారని ఆయన వ్యాఖ్యానించడం మరింత రెచ్చగొట్టడమే అవుతుంది. ఎదుటి వారు జ్ఞానం లేకుండా ఆవేశంతో చేశారని, మనం కూడా అదే గడ్డి తింటే ఇక వారికి మనకి తేడా ఏముంటుంది... కత్తిమహేష్‌గారూ...! ఇక ఆయన 'అజ్ఞాతవాసి' చూసి రివ్యూ ఇస్తానని చెబుతున్నాడు. అది ఆయన వృత్తి కాబట్టి ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పరు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ని మరలా సాగదీయడం మాత్రం సమంజసం కాదని చెప్పాలి.