సినిమాలలో రాణించాలంటే కంటెంట్‌ని నమ్ముకోవడం, ప్రొడక్షన్, ఇతర ప్రమోషన్స్, ఇలాంటి ప్లానింగ్ ఉన్న వారికి ఒకటి రెండు దెబ్బలు తగిలినా ఎప్పటికైనా రానిస్తారు. ముఖ్యంగా కంటెంట్ నమ్ముకోవాలి. ఇక హీరోగా నాని నేచురల్‌స్టార్ అనే బిరుదుకి న్యాయం చేస్తున్నాడు. బడా బడా సోకాల్డ్ స్టార్స్ కంటే తానెందుకు భిన్నమో మాటలతో కాదు.. చేతలతో నిరూపిస్తున్నాడు. ఇంతకాలానికి నిజమైన హీరోకి, నిజమైన బిరుదుగా నేచురల్‌స్టార్ నాని నిలుస్తున్నాడు. ఒకే చిత్రం కోసం ఏడాది మొత్తం కేటాయించి, భారీగా రెమ్యూనరేషన్లు పెంచి ఇబ్బంది పెట్టకుండా, మంచి కంటెంట్‌తో, తనకు సూట్ అయ్యే పాత్రలతో 20కోట్లలో సినిమా తీస్తే యావరేజ్ అయినా కూడా డబుల్ ప్రాఫిట్స్ ఖాయం అని నిరూపిస్తున్నాడు.
ఇక ఆయన ఎవరో స్టార్ హీరోయిన్లు, స్టార్ దర్శకుల కోసం వెయిట్ చేసే రకం కాదు. కొత్త అమ్మాయిలను, డైరెక్టర్లనే ఆయనే తన చిత్రాల ద్వారా స్టార్స్‌ని చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి హీరోని చేసి ఎంతో కాలమైంది. ఇక ఈయనకు దర్శకత్వశాఖలో కూడా పనిచేసిన అనుభవం మరింత ప్లస్ అవుతోందనే చెప్పాలి. ఆమధ్య 'డిఫర్ దోపిడి' అనే చిత్రానికి లాస్ట్ మినిట్‌లో భాగస్వామిగా చేరడం, 'పైసా, జెండాపై కపిరాజు' చిత్రాలను తానే రిలీజ్ అయ్యేలా చూడటం వంటి ఎదురుదెబ్బలు తినడంతో ఇప్పుడు నిర్మాతగా కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఓవైపు ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బడా స్టార్స్‌తో సరిసమానమైన ఆదాయం పొందుతూనే, తనకి నచ్చిన కథలతో సినిమా నిర్మాణం కూడా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు నిర్మాతగా తన తెలివితేటలేంటి? ఇండస్ట్రీకి మనం ఉపయోగపడటం సరే..ఇండస్ట్రీని మనం ఉపయోగించుకోవడం ఎలా? అనే విషయంలో పీహెచ్‌డీ దిశగా సాగుతున్నాడు.
తనను వాయిస్‌ఓవర్ ఇవ్వమని అడిగిన కుర్రాడి కథ నచ్చి తానే నిర్మాతగా ప్రశాంత్ వర్మని దర్శకునిగా పరిచయం చేస్తూ 'అ' చిత్రం రూపొందిస్తున్నాడు. ఇక ఈచిత్రం ఓపెనింగ్స్‌కి, సినిమా నిలబడటానికి క్యాస్టింగ్ ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏరేంజ్‌లో చేయాలో తెలిసిన వాడు కావడంతో కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషాహెబ్బా, శ్రీనివాస్ అవసరాల వంటి వారిని ఎంచుకుని వారి డేట్స్‌ని రోజుల వారిగా మాట్లాడుకుని, వారి పాత్రలను, సినిమాని కూడా వేగంగా పూర్తి చేశాడు. తనతో పాటు రవితేజ చేత కూడా వాయిస్‌ఓవర్ ఇప్పించాడు.
తాజాగా విడుదలైన ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రమోషన్స్‌తో కలిపి ఈ చిత్రం బడ్జెట్‌ని ఆరేడు కోట్లకి మించకుండా చేసుకున్నాడట. డిజిటల్, ఓవర్‌సీస్, శాటిలైట్‌తో కలిపి బడ్జెట్‌ని దాదాపు రికవరీ చేశాడని, ఇక థియేటికల్‌రైట్స్, అనువాద హక్కులు వంటివన్నీ ఆయనకు లభించే ఆదాయమని తెలుస్తోంది. అయినా ఎంత లాభం ఉన్నాఇలాంటి ప్రయోగం చేయడానికి దమ్ము కావాలి. అది నానిలో ఉందని తెలుస్తోంది....!