మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరి అభిప్రాయలు, మనోభావాలు వారికుంటాయి. వాటిని సమర్ధించే వారు ఉన్నట్లే వాటితో విభేదించేవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. కేవలం అభిమానులకో, లేక మీకో దేవుడు అయినంత మాత్రాన పవన్ అందరికీ అభిమాన పాత్రుడుకావాలని, ఆయన అందరికీ దేవుడు కావాలని లేదు. ఇక కోనవెంకట్ తాజాగా పవన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఆలోచన కేవలం ఒకే వైపు ఉందని అర్ధమవుతోంది. పెద్ద మనిషిగా వ్యవహరించాలని భావించినప్పుడు నాణానికి ఉండే బొమ్మ బొరుసు రెంటిని చూడాలి. కానీ కోన వ్యాఖ్యలో ఆ పెద్దరికం కనిపించడం లేదు. పవన్ చిత్రాలనో, ఆయన నటన, డబ్బింగ్ చిత్రాలను రీమేక్‌లు చేసే విధానాన్నో ఎండగట్టినంత మాత్రాన ఆయా విమర్శలు చేసిన వారి వ్యక్తిగత జీవితాలలోకి కూడా ప్రవేశిస్తామనేట్లుగా పవన్ అభిమానులు ప్రవర్తించడం సరికాదు.
అందునా పవన్ ఇప్పుడు కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు. ఆయన రాజకీయనాయకుడు. ఆయన కోనవెంకట్‌కి, ఆయన అభిమానులకు నిస్వార్ధపరుడు, సేనానే కావచ్చు. కానీ ఒక్కసారి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మాత్రమే కాదు.. సెలబ్రిటీగా మారినంతనే వారికంటూ ఇక ప్రైవేట్ లైఫ్ ఉండదు. తప్పు చేస్తే చీల్చిచెండాడతామని శ్రీశ్రీ వంటి మహానుభావుడే చెప్పాడు. ఇక పవన్‌పై ప్రశంసలు వచ్చినప్పుడు ఎలా స్వీకరిస్తారో.. విమర్శలు వచ్చినప్పుడు కూడా హుందాగా తీసుకోవాలి. ఇందిరాగాంధీ, మోదీ, జయలలిత, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి మోనార్క్‌లే నశించారు.. భవిష్యత్తులో నశిస్తారు. ఏదీ ఎవడబ్బ సొమ్ము కాదు. మహామహా నియంతలే మట్టి కలిసిపోయారు.
కాబట్టి నేటి సమాజంలో, ప్రజాస్వామ్యంలో వ్యక్తులను దేవుళ్లని చేసి, ఏ చిన్న విమర్శ చేసినా చంపుతాం.. నరుకుతాం అనడం సరికాదు. పవన్ అభిమానులు అదే చేస్తున్నారు. ఈ గొడవ ఆరంభంలో మాత్రం కత్తి మహేష్ పవన్ సినిమాలు, ఆయన భావాలపై మాత్రమే స్పందించాడు. కానీ పవన్ అభిమానులు ఆయన మీద వ్యక్తిగతంగా, అసభ్య పదాలతో దాడి చేశారు. అది ఆక్షేపణీయం. ఈ విషయంలో పవన్ తన అభిమానులను కాస్త దారిలో పెట్టాలని అందరూ భావిస్తున్నారు. ఇక మీకు.. ఆయన అభిమానులకు ఆయన సినిమా అవకాశాలు ఇచ్చే దేవుడో, లేక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే మహానుభావుడో కావచ్చు. కానీ అంత మాత్రాన ఆయన విమర్శలకు అతీతుడు మాత్రం కాలేడు. పవన్‌కి కోట్లాది మంది అభిమానులు ఉండవచ్చు. ఆయనను అంటే బాధపడే వారు ఉండవచ్చు కానీ అంత మాత్రాన అందరూ అలాగే ఉండాలని లేదు.
గాంధీ వంటి మహానుభావుడి మీద, నెల్సన్ మండేలా, మధర్‌ధెరిస్సా వంటి వారిపై కూడా విమర్శలు వచ్చాయి. గౌతమబుద్దుడు, ఏసుక్రీస్తు, సాయిబాబా వంటి వారికే విమర్శలు తప్పలేదు. కోనవెంకట్ మాట్లాడుతూ, ఇలా తమకు ఇష్టమొచ్చినట్లు మన తల్లి దండ్రులను, అక్కా చెల్లెళ్లను తిడితే చెంప పగుల గొడతాం అన్నాడు. మరి పవన్ ఫ్యాన్స్ వాడుతున్న అసభ్యపదజాలం, వ్యక్తిగత దాడి విషయం ఏమిటి? ముందు వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసింది పవనా? లేక కత్తి మహేషా? అనేది తేలితే ఈ చర్చకు ముగింపు దాని కదే దొరుకుతుంది.