చిన్న సినిమాలు విడుదలైనప్పుడల్లా ‘ఆ నలుగురు’ అంటూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సురేష్ బాబు , దిల్ రాజు లాంటి అగ్ర ప్రొడ్యూసర్స్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు చాలామంది చిన్న నిర్మాతలు. వీళ్లు థియేటర్లను గుప్పెట్లో ఉంచుకుని ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారని.. చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుంటాయి.
అయితే చాలా వారకు ఈ వ్యాఖ్యలు చేసేది చిన్న సినిమాల నిర్మాతలే. అయితే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ కూడా నిర్మాత దిల్ రాజును లక్ష్యంగా చేసుకోవడం విశేషం. నైజాం డిస్ట్రిబ్యూషన్ ముగ్గురి చేతిలో చిక్కుకుపోయిందని ఆయన ఆరోపించారు. సినిమాలు కొంటె వాళ్ళే కొనాలి.. లేకపోతే ఎవరిని కొననివ్వడం లేదు. ఇదిలాగే కొనసాగితే నిర్మాతలు సినిమాలు చేయలేరు. అప్పుడు హీరోలే సినిమాలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణంలో ఉన్న కష్టాలు మెల్లమెల్లగా వాళ్లకీ అర్థమవుతాయి. అని కళ్యాణ్ అన్నారు.
మార్చి 1 నుంచి పరిశ్రమను షట్ డౌన్ చేయడం ఖాయమని..క్యూబ్.. యూఎఫ్‌వోలతో పెద్ద తలనొప్పి తయారైందని.. జీఎస్టీ కార్పొరేట్ సంస్థలు నిర్మించే సినిమాలకు సరిపోతుంది తప్ప.. తమలాంటి ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్లకు సెట్టవ్వదని.. అందుకే ఈ సమస్యలన్నింటి మీదా పోరాటం కోసమే స్ట్రైక్ అని ఆయన అన్నారు.