తెలుగు మాస్ హీరోలు మారుతామని చెబుతారే గానీ ఏమాత్రం మారరు. వారి కోసం ప్రేక్షకులు మారాల్సిందే కానీ రొటీన్ స్టోరీలు, కామెడీ ట్రాక్‌లు, హై ఎనర్జీ షాట్స్‌తో పక్కా మాస్ అవతారంలోనే మరలా మరలా దర్శనమిస్తూ ఉంటారు. ఇక వారిలో రవితేజ కూడా ఒకడు. ఈయన గతంలో ఎన్నో చిత్రాలను చేసినా తన చిత్రాలనే మరలా మరలా అటు తిప్పి ఇటు తిప్పి చూపి ప్రేక్షకుల మీదకి వదిలేవాడు. అదేమంటే రవితేజ సినిమాలలో ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని ఉంటాయి అనే డైలాగ్‌ని మాత్రం అరగదీసి వదిలేవాడు. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకుని 'బెంగాల్ టైగర్' తర్వాత ప్రపంచం చుట్టి వచ్చిన ఆయన నటించిన 'రాజా ది గ్రేట్' కూడా మామూలు చిత్రమే గానీ అది అనిల్‌రావిపూడి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్ డోస్... హీరో పాత్ర అంధుడు అనే బిల్డప్, దిల్‌రాజు ప్రమోషన్ల వల్ల హిట్ కేటగరిలో చేరింది. నాడు 'రాజా ది గ్రేట్' ఇంటర్వ్యూల సందర్భంగా కూడా రవితేజ భలే బిల్డప్ ఇచ్చాడు.
ఇప్పుడు ప్రేక్షకులు బాగా మారిపోయారని, వారి అభిరుచి మారిందని, ఇక నుంచి కొత్తదనం లేని చిత్రాలలో నటించనని బోలెడు స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. దాంతో రవితేజ నుంచి కొత్తదనం నిండిన చిత్రాలు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' వంటి చిత్రాలు వస్తాయేమోనని అందరూ ఆశించారు. ఇక తాజాగా ఆయన మరోసారి తనదైన రూట్‌లోనే 'టచ్‌చేసి చూడు' చిత్రం చేస్తున్నాడని ఈ చిత్రం టీజర్‌ని చూస్తేనే చాలు అర్ధమవుతోంది. హీరోని టచ్ చేసి చూస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో అనే బిల్డన్ షాట్స్‌తో ఈ టీజర్‌ని కట్ చేశారు. పక్కా మాస్ మసాలా చిత్రాన్నే కొత్త దర్శకుడైన విక్రమ్ సిరికొండ తీస్తున్నాడని చెప్పడానికి ఈ టీజర్ ఒక్కటి చాలు. ఎడా పెడా యాక్షన్ బిల్డప్, హీరోయిజం పీక్స్, వెనుక రణగొణ ధ్వనుల మధ్య సంగీతం.. వెరసి ఇది మాస్ అండ్ 'నేలబెంచి' టిక్కెట్ సినిమా అని నిరూపించుకున్నాడు.
ఇక ఈ చిత్రంలో రాశిఖన్నా, సీరత్ కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. మధ్యలో బాలయ్య, పవన్‌లకి పోటీ వచ్చి సంక్రాంతికి 'టచ్ చేసి చూడు' అనిపించాలని భావించినా, ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా మరో సోలో రిలీజ్ డేట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి 'టచ్ చేసి చూడు'ని మెతుకు పట్టుకున్న వెంటనే అన్నం ఉడికిందో లేదో తెలిసే చందంగా, ఈ టీజర్‌ని చూస్తేనే సినిమా పూర్తిగా ఇంట్లోనే కూర్చుని చేసిన ఫీలింగ్‌ని కలిగిస్తోంది.