పాపం.. ప్రజల కోసం చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడుతున్నాడు. ఎవరికి ఏ సాయం అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తున్నాడు. ఇక ఒకనాడు అభివృద్ది తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే ఉచిత పథకాలు, ప్రజాకర్షక పథకాలపై నిప్పులు చెరిగిన ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవ్వరూ అడగకుండానే 'రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు, సంక్రాంతి ఆఫర్లు' ప్రకటిస్తున్నారు. ఏదో పిండివంటలకి తూతూ మంత్రంగా, పప్పులు, బెల్లాలు పంచుతున్నాడు. ఆయన దీనికోసం కోట్లలో ఖర్చుచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పాపం.. పవన్‌కళ్యాణ్‌కి కూడా సంక్రాంతి బంపర్ ఆఫర్‌ని ప్రకటించాడు.
ఈనెల 10వ తేదీన విడుదలకు సిద్దమవుతోన్న పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'అజ్ఞాతవాసి' విషయంలో తన ఉదారత చాటుకున్నాడు. ఏకంగా చిత్రం విడుదలైన 10 వతేదీ నుంచి 17 వ తేదీ వరకు అర్ధరాత్రుళ్లు ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ చిత్రం స్పెషల్ షోలకి అనుమతి ఇచ్చాడు. ఎక్కడ విమర్శలు వస్తాయేమో అనే ముందు జాగ్రత్తతో సంక్రాంతి సందర్భంగా నైట్ షాపింగ్‌లకు కూడా అనుమతి ఇస్తున్నామని ప్రకటించాడు. ఇక పవన్ చిత్రం అంటే థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు అధిక టిక్కెట్ల రేట్లతో ఎలాగూ ప్రజల వీక్‌నెస్‌ని ఆధారం చేసుకుని ఘరానా మోసానికి తెరతీయడం సాధారణమే. ఇక నేటి రోజుల్లో ఏ చిత్రమైన మొదటి వారం కలెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వ నిర్ణయం 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ రాజకీయ ప్రస్ధానం ప్రజలకు ఎలాంటి మేలు చేకూరుస్తుందో తెలియదు గానీ ఆయన నిర్మాతలకు మాత్రం బాగానే ఉపయోగపడుతోంది. మరోవైపు ఈ చిత్ర దర్శకనిర్మాతలు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ని కలిసి ఈ చిత్రం ప్రీమియర్ షోకి ఆహ్వానించడానికి మాత్రమే వచ్చామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా కూడా దాని అర్ధం పరమార్ధం అందరికీ తెలుసు. పవన్ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ముచ్చట్లు జరిపాడు. ఒకటి రెండు రోజుల ముందు పవన్‌ని అపరిచితుడుతో పోల్చిన తన కుమారుడి కంటే కాస్త పెద్ద మనసుతో కేసీఆర్ పవన్ మనోడు.. బాగా చూసుకోండి అని సెలవిచ్చాడు. ఒకరోజు గ్యాప్‌లో అపరిచితుడు, అజ్ఞాతవాసి కాస్తా వెలుగులోకి వచ్చాడు. ఇక ఎలాగూ ఆ వెంటనే బాలయ్య 'జైసింహా' ఉంది కాబట్టి దానికి కూడా ఏపీలో తిరుగేలేదు.
మరి తెలంగాణలో 'అజ్ఞాతవాసి', 'జైసింహా'లకి కేసీఆర్ కానుక ఇవ్వడానికి రెడీగా ఉన్నాడా? లేక 'కాటమరాయుడు' పరిస్థితే ఎదురవ్వనుందా? అనేదివేచిచూడాల్సి వుంది. పెద్దలు పెద్దలు ఒకటై ప్రేక్షకుల నడ్డి విరగొట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.