ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ తో సంక్రాంతి పండగ ముందే వచ్చేసిందా అనేంతగా పవన్ అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్‌లు హీరోయిన్‌లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్ర ట్రైలర్ అందరిని వెయిట్ చేయించి ఎట్టకేలకు 7 వ తేదీ ఉదయం ఒంటిగంట 15 నిమిషాలకు విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 'ఒక కుర్చీని తయారు చేయడానికి ఎంత హింసా ధర్మం వుందో.. జీవితంలో మనిషి కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది..' అని పవన్ చెప్పే డైలాగ్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు. ఇక ట్రైలర్ చివరిలో.. 'మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా వర్మా..' అని మురళీశర్మ అంటే, 'ఆడు ఏది ఎక్కినా పర్లేదు కానీ.. మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు..' అని రావు రమేష్ చెప్పడం చూస్తుంటే.. ఈ సినిమాలో ఉండాల్సినవన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. ఇక 10 తేదీ రోజు మినీ కాదు కానీ పెద్ద యుద్ధమే జరిగినా జరగవచ్చు. అప్పటి వరకు ఈ ట్రైలర్ ప్రభంజనం కొనసాగేలనే ఉంది.