పక్కవాడి మీదకి వేలు చూపించేటప్పుడు నాలుగు వేళ్లు మనల్ని చూపిస్తుంటాయని మరవవద్దు అని పెద్దలు చెబుతారు. ఇక నీతులు పక్కవారికే గానీ తమకు కాదనే సూక్తి కూడా ఉంది. ఇది పవన్ విషయంలో నిజమేనని అనిపిస్తోంది. వాస్తవానికి పవన్ వ్యక్తిత్వం చూసి ఆయనను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. ఆయన కులం, డబ్బు, అధికారం వద్దని చెబుతాడు. కానీ ఆయన అభిమానులు మాత్రం అదే పనిలో ఉంటారు. నిజంగా పవన్ అభిమానులకి కులపిచ్చి లేకపోతే, వారు ఎంతో హుందాగా ఉండేవారు. కొన్నిసార్లు మౌనమే పరిష్కారం అన్నట్లుగా మరికొన్నిసార్లు మౌనమే పెద్ద తప్పిదం కూడా అవుతుంది.
తాజాగా పవన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు. నిన్ను వ్యక్తిత్వంలో ఓడించడం చేతకాని వారే.. నీ డబ్బు, నీ కులం, నీ వర్ణం గురించి మాట్లాడుతారు అనే మెసేజ్‌ని షేర్ చేశాడు. ఇది ఎవరు చెప్పారో తనకి తెలియదని, కానీ ఓ గౌరవనీయుడైన జర్నలిస్ట్ దీనిని తనకు పంపారని ఆయన తెలిపాడు. సమాజంలో కులం, పవర్ పాలిటిక్స్ వల్ల సమాజానికి ఎంతో కీడు జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలలో అవి పోషిస్తున్న పాత్ర చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చెప్పాలి. ఇవి మన ఆర్ధికమందగమనానికే గాక సమాజానికి ఎంతో కీడు చేస్తాయని చెప్పాడు.
నిజంగా పవన్ చెప్పిన విషయం నిజమే. కానీ ఆయన అభిమానులు మాత్రం ఇతరులపై కులం, వర్ణం, డబ్బు విషయాలపైనే టార్గెట్ చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెప్పారు. కాబట్టి సంస్కరణ అనేది పవన్ తన కుటుంబం నుంచి తన అభిమానుల నుంచి మొదలుపెడితేనే ఆయనపై నమ్మకం ఏర్పడుతుంది. పవన్‌కి తెలుసో తెలియదో గానీ పవన్ అభిమానుల వల్ల ఆయన పరువు పోతోంది. గతంలో కృష్ణ కుమార్తె మంజుల మాట్లాడుతూ, తాను నటిని కావాలని భావించినప్పుడు తన తండ్రి అభిమానులే సమాజం అని భావించానని, కాదని తెలుసుకునే లోపు సమయం చేజారిందని తెలిపింది. ప్రస్తుతం పవన్ కూడా తన అభిమానులే లోకంగా బతుకుతున్నాడు. ఇది ఆయన భవిష్యత్తుకు ఏరకంగాను ఉపయోగపడదనే చెప్పాలి....!