నిన్నటితరం వారికి స్టువర్ట్‌పురంకి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి బాగానే తెలుసు. ఆయన ఓ రాబిన్‌హుడ్‌లా నాడు పేరు తెచ్చుకున్నాడు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు, ప్రజలకు ముచ్చెమటలు పట్టించాడు. నాడు దేశంలో చార్లెస్ శోభరాజ్, ఏపీలో టైగర్ నాగేశ్వరరావుల పేర్లు పతాక శీర్షికల్లో ఉండేవి. ఇక విషయానికి వస్తే దగ్గుబాటి రానా రూటే సపరేట్. ఆయన తన పాత్ర ఎంత నిడివి, హీరోయిజం వంటివి పట్టించుకోడు. వైవిధ్యభరితమైన చిత్రాలకు, కథలకు, పాత్రలకు వెంటనే ఓకే చెబుతాడు.
'బాహుబలి'లో విలన్ 'భళ్లాలదేవ'గా అదరగొట్టి, ఆ వెంటనే 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' చేశాడు. ప్రస్తుతం '1945' అనే పిరియాడికల్ మూవీలో నేతాజా సుభాస్‌చంద్రబోస్ నడిపిన ఆజాద్ హిందు ఫౌజ్‌లో ఓ సైనికుడిగా కనిపించనున్నాడు. మరోవైపు 'హాథీ మేరా సాథీ'ని రీమేక్ చేస్తున్నాడు. పలు వెబ్‌సిరిస్‌లతో వెంకీతో కలిసి కూడా ఓ వెబ్‌సిరిస్‌లో నటించనున్నాడు. వరుణ్‌తేజ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్, అఖిల్ మూడో చిత్రానికి నిర్మాతగా కూడా మారనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈయన ప్రస్తుతం మరో వైవిధ్యమైన చిత్రం ఓకే చేశాడట. రాజ్‌తరుణ్‌తో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం తీసిన దర్శకుడు వంశీకృష్ణ.. టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఓ కథను సిద్దం చేశాడని, ఇందులో టైగర్ నాగేశ్వరరావుగా నటించడానికి రానా ఓకే చేశాడని వార్తలు వస్తున్నాయి. బహుశా కొత్త ఏడాదిలో రానా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మొదటి చిత్రం ఇదేనని తెలుస్తోంది.