నేటి జనరేషన్ స్టార్ హీరోలలో అల్లుఅర్జున్, ఎన్టీఆర్‌లకి నటనపరంగా మంచి మార్కులు పడతాయి. విభిన్న పాత్రలను పోషించడానికి ఒప్పుకోవడమే కాదు. పాత్రల్లోలీనమై నటించడంలో సినిమాలోని పాత్రకు తగ్గట్టు లుక్స్, గెటప్స్ పరంగా బాగా శ్రమించే వారు ఈ ఇద్దరు. ఇక బన్నీ విషయానికి వస్తే 'గంగోత్రి'లో ఆయన్ను చూసి పెదవి విరిచిన వారు కూడా ఇప్పుడు ఆయన అంకిత భావం చూసి మెచ్చుకుంటున్నారు. దాంతోనే మెగాభిమానులే గాక న్యూట్రల్ ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా ఆయనకు ఫిదా అవుతున్నారు.
ఇక నాడు యాక్షన్‌కింగ్ అర్జున్, అరుణ్‌పాండ్యన్ వంటి వారికి సిక్స్‌ప్యాక్ ఉండవచ్చుగానీ ఓ స్టార్ హీరో సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం 'దేశముదురు' చిత్రంతో తెలుగులో బన్నీనే స్టార్ట్ చేశాడు. ఇక పాత్రకి తగ్గట్లుగా వేరియేషన్స్ చూపిస్తూ స్టైలిష్‌స్టార్ అనే బిరుదుకి న్యాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రంలో మిలటరి అధికారిగా కనిపించనున్నాడు. వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ 1వ తేదీన విడుదలై యూనానిమస్‌గా పాజిటివ్ టాక్‌ని అందుకుంది. కేవలం 29 గంటల్లోనే కోటి వ్యూస్‌ని సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులే కాదు... తెలుగు సినీ ప్రేక్షకులు, కోలీవుడ్, బాలీవుడ్, మరీ ముఖ్యంగా మల్లూవూడ్ వారు ఎంతో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం గురించి తాజాగా నిర్మాత లగడపాటిశ్రీధర్ మాట్లాడుతూ, ఈ చిత్రం అతి తక్కువ సమయంలో కోటి వ్యూస్‌ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నాడు. అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇందులో దేశభక్తితో పాటు అల్లుఅర్జున్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. సినిమా సినిమాకి బన్నీ తన హార్డ్‌వర్క్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. సినిమా బాగా రావడం కోసం ఇంతగా కష్టపడేది అమీర్‌ఖాన్ తర్వాత బన్నీనే అని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన కమల్‌హాసన్, విక్రమ్, సూర్య వంటి వారిని మాత్రం విస్మరించడం బాధాకరం. ఇక ఈ చిత్రం షూటింగ్ 70శాతం పూర్తయింది. మరో 40రోజుల్లో అన్ని పూర్తవుతాయని చెప్పి, మరోసారి ఈ చిత్రం ఏప్రిల్ 27నే విడుదల కావడం గ్యారంటీ అని చెప్పేశాడు.