తెలంగాణ యాసతో విలనీతో కూడిన కామెడీని పండించడంలో కారుమంచి రఘుకి మంచి పేరుంది. ఈయనకు షాద్ నగర్‌లో పొలాలు, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది. కానీ స్నేహితుల మోసం వల్ల అన్ని కోల్పోయాడు. దాంతో ఒకానొక సమయంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారే ఎలాగా అని డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఆయన భార్య ద్వారా విషయం తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు, ఆయన స్నేహితులు ఆయన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
ఇక ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆది' చిత్రంతో నటునిగా పరిచయమయ్యాడు. నాటి నుంచి ఆయన ఎన్టీఆర్ ప్రతి చిత్రంలో కనిపిస్తూనే ఉంటాడు. రిస్క్ చేయందే లాభం లేదని, అందుకే తాను మరో బిజినెస్‌ని స్నేహితులతో చేస్తున్నానని, ఎలాగైనా ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం నిర్మించడం తన ధ్యేయంగా చెప్పుకుంటాడు. అంటే పవన్‌కి బండ్లగణేష్ ఎలాగో ఎన్టీఆర్‌కి రఘు అలా అన్నమాట. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ, నేను ఓ చిత్రం కోసం రికార్డింగ్ థియేటర్‌లో డబ్బింగ్ చెబుతున్నాను. పక్క థియేటర్‌లో 'జల్సా' డబ్బింగ్ జరుగుతోంది. నేను బయటికి వచ్చిన సమయంలోనే పవన్ కూడా బయటికి వచ్చాడు. ఆయన త్రివిక్రమ్‌తో ఏదో మాట్లాడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ వెనక్కి వస్తున్నాడు. దాంతో ఆయన్ను పలకరించాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నాను.
అప్పుడు త్రివిక్రమే నన్ను పలకరించారు. నువ్వంటే భలే ఇష్టం. ముఖ్యంగా 'అతిధి' చిత్రంలో నీవు నటించిన సీన్ చూసి ఎంతో ఎంజాయ్ చేశాను. పడి పడి నవ్వాను. అదే విషయం చాలాసార్లు మహేష్‌కి కూడా చెప్పాను. ఖచ్చితంగా మనం చేద్దాం అన్నారు. నాటి నుంచి త్రివిక్రమ్ చిత్రంలో నటించాలని ఎదురుచూస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు రఘు. ఇక ఈయన సినిమాలలోకి రాకముందే తాను కొన్ని సెటిల్‌మెంట్లు కూడా చేసి, పలు బ్యాంకులకు వసూలు కానీ మొండిబకాయిలను వసూలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు.