త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి మంచి మాటల రచయితగా, మాటల మాంత్రికుడిగా అయితే తిరుగేలేదు.కానీ ఆయన తీసే చిత్రాలు మాత్రం ఎక్కడోచూసిన జ్ఞాపకం అనిపించేలా ఉంటాయి. అయినా తన మాటలతో, స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేయడం, పాత సారాని కొత్త సీసాలో నింపడం ఆయనకు మామూలే. గతంలో ఆయన తీసిన చిత్రాలన్నీ అలాంటివే. ఇక 'అ..ఆ' అయితే 'మీనా'కి లేటెస్ట్ వెర్షన్‌గా అందరూ చెప్పుకున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్‌తో చేసే చిత్రం కోసం కూడా బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్‌ఎల్‌బి' రీమేక్‌ని నమ్ముకున్నాడని, ముందు జాగ్రత్తగా హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ చేత ఈ చిత్రం రీమేక్ హక్కులని కొనుగోలు చేయించాడని అంటున్నారు.
మరోవైపు త్రివిక్రమ్ తాజాగా చిత్రం 'అజ్ఞాతవాసి'కి విడుదలకు దగ్గర పడే కొద్ది విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇందులో పవన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని కొందరు అంటుంటే కత్తి మహేష్‌తో పాటు చాలా మంది ఇది 2008లో వచ్చిన హాలీవుడ్ చిత్రం 'లార్జో వించ్'కి ఇంటెలిజెంట్ కాపీ వెర్షన్ అనే విమర్శలు వస్తున్నాయి. ఆ చిత్రం ట్రైలర్ తరహాలోనే 'అజ్ఞాతవాసి' టీజర్ కూడా ఉందని విమర్శలు వస్తున్నాయి. అయినా కేవలం టీజర్‌ని చూసి మాత్రమే ఈ చిత్రం కాపీ అని అనడం కూడా సమంజసం కాదు. గతంలో ఓ బాలీవుడ్ చిత్రం విషయంలో 'మగధీర'ని కాపీ అని చెప్పి అల్లు అరవింద్ నవ్వుల పాలయ్యాడు. మరోవైపు 'అజ్ఞాతవాసి' చిత్రం అటు ఇటు తిప్పి 'అత్తారింటికి దారేది'నే తీశాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక 'లార్జో వించ్' ఇండియా హక్కులు టీసిరీస్ వద్ద ఉన్నాయి. దాంతో ఈ చిత్రం యూనిట్ రానా ద్వారా టీ-సిరిస్‌తో 10కోట్లకు రాజీ ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
దీనిపై తాజాగా మహేష్ కత్తి మాట్లాడుతూ, ఏదైనా తెలుగు నవలని, పాత సినిమాని కాపీ కొట్టి ఉంటే కాస్త ఖర్చుతో పోయేది. ఏకంగా యూరోపియన్ చిత్రాన్ని కాపీ కొట్టావు. అక్కడ యూరోలు కాబట్టి నిర్మాణ సంస్థకు ఖర్సైపోద్ది అంటున్నాడు. ఇక ఆయన పవన్ అభిమానులను ఉద్దేశించి కూడా 'మీరు మాట్లాడే ప్రతి మాటా, మీరు చేసే ప్రతి కామెంట్, మీరు తిట్టే ప్రతి బూతు, కూసే ప్రతి కూతా.. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ పవన్‌కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడుతాను. గుర్తు పెట్టుకోండి' అని హెచ్చరించాడు. ఇక తాజాగా ఈ మహేష్, పవన్ గొడవలోకి రచయిత కోనవెంకట్ ఎంటర్ అయ్యాడు. 'పవన్ మౌనాన్ని ప్రతి జోకర్ ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్నారు' అని కామెంట్ చేశాడు. దాంతో కత్తి మహేష్ కూడా 'ఒక జోకర్‌కి మరో జోకర్, ఒక బ్రోకర్‌కి మరో బ్రోకర్ సమర్ధించడం సహజమే. చేతగానితనాన్ని మౌనంగా ఏమారుస్తున్నారు. మీలాంటి వారు పవన్‌ని మరీ ఏబ్రాసినీ చేయకండి' అంటూ విరుచుకుపడ్డాడు.