తెలుగు రాష్ట్రాలలో సినిమా అనే కళని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అంతకంటే ఎక్కువగా సినిమా కథానాయకులని అభిమానిస్తుంటారు, వారిని పూజిస్తుంటారు. అలా పూజ్యనీయులైన మహానుభావులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రముఖులు. ఆయన ప్రతిపాదించినప్పటికీ అక్కినేని అభిమానులు నాగేశ్వరరావు గారి వారసులని ఆదరిస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఆర్టిస్టులు ఎంత సున్నితంగా వుంటారో వారి అభిమానులు అంతకంటే సున్నిత మనస్కులని గ్రహించాల్సిన అవసరం హీరోలకి ఎంతైనా వుంది. ఈ విషయమై అఖిల్ అక్కినేనికి అభిమానులు ప్రత్యేక లేఖలో వారి ఆవేదన తెలియజేసుకున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో తరతరాలుగా అక్కినేని అభిమానులుగా అక్కినేని కుటుంబ హీరోల చిత్రాలని ఆదరిస్తున్న కొందరు అభిమానులకి ప్రస్తుత కాలంలో కొత్త పంపిణీదారులకి అక్కినేని వారి చిత్రాలు విక్రయించటం తలవంపులు తెచ్చిపెట్టింది. అఖిల్ నటించిన తాజా చిత్రం హలో విడుదలని భారీగా ఊహించుకున్న అభిమానులకి ఉత్తరాంధ్ర పంపిణీదారుడి తీరు తీవ్రంగా కలిచివేసింది. పైగా హలో ఆడియో వేడుక సందర్భముగా వైజాగ్ నగరంలో అఖిల్ వ్యక్తిగత సిబ్బంది అభిమానులతో వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండటంతో నొచ్చుకున్న అభిమానులు తమ ఆవేదన తెలుపుతూ అఖిల్ కి ఈ లేఖ రాశారు. తరతరాలుగా తమ కుటుంబాన్ని అభిమానిస్తూ ఆదరిస్తున్న ఉత్తరాంధ్ర అభిమానులకి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ యువ హీరో అఖిల్ అక్కినేని ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.