అతి పిన్న వయసులో అక్కినేని వారి ఇంట మూడవ తరం వారసుడైన అక్కినేని అఖిల్ ని 2015 లోనే గ్రాండ్ లాంచ్ కి వ్యూహం రచించి దెబ్బతిన్నారు కింగ్ నాగార్జున. అక్కినేని కుటుంబానికి వున్న రొమాంటిక్ హీరోస్ ఇమేజ్ నుంచి కొంచం దూరంగా అఖిల్ ని మాస్ హీరోగా మలచాలనే ప్రయత్నంతో దర్శకుడు వి.వి.వినాయక్ చేతిలో పెట్టగా, మాస్ డైరెక్టర్ గా వినాయక్ శ్రమించినప్పటికీ దర్శకుడు, నిర్మాత నితిన్ రెడ్డి, నాగార్జున అందరూ కలిసి స్టోరీ సెలక్షన్ లోనే పెద్ద తప్పు చేయటంతో అఖిల్ తొలి చిత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ 19 కోట్ల రూపాయల పై చిలుకు షేర్ రాబట్టింది. అఖిల్ కి మంచి మాస్ ఎంటర్టైనర్ పడితే మాస్ హీరో ఇమేజ్ పెరుగుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో నాగార్జున మాత్రం ప్లాన్ బి అమలు చేశారు.
అఖిల్ చిత్ర పరాజయం తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఎన్నో కథలు రిజెక్ట్ చేసిన తరువాత ఒప్పుకున్నకథ 'హలో'. గతంలో వెలిగొండ శ్రీనివాస్ వంటి మూస కథల రచయితని నమ్మి మోసపోయిన నాగార్జున ఈసారి తన సొంత నిర్మాణంలో మనం వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'హలో' అఖిల్ కి మాస్ ఇమేజ్ కాకపోయినా ఫామిలీ లెగసీ కొనసాగించే బలాన్ని ఇస్తుందని అభిమానులు ఆశపడగా రివ్యూస్ బాగున్నప్పటికీ రెవెన్యూస్ లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. దాదాపు 32 కోట్లకి థియేట్రికల్ రైట్స్ విక్రయించగా 20 కోట్ల షేర్ రీచ్ కాకముందే హలో బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ సారైనా నాగార్జున బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు వహించి అఖిల్ మూడవ చిత్రాన్ని ప్లాన్ చేస్తే మంచిది ఏమో.