తన 'బాహుబలి' తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మాతగా రామ్‌చరన్, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ని రాజమౌళి చేయనున్నాడని గత కొంత కాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాజమౌళి తను ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో అటు ఇటు కూర్చుని దిగిన ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై వార్తలు రాగా, 'జవాన్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇది నిజమేనని మెగామేనల్లుడు సాయిధరమేతేజ్ స్పష్టం చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. మరోవైపు ఈ ఇద్దరు స్టార్స్‌కి సరిపడా పాయింట్‌ని ఓకే చేసుకున్నాకే రాజమౌళి ఆ ఫొటోని పోస్ట్ చేశాడని తెలుస్తోంది. దీంతో గత రెండు మూడు నెలలుగా ఈ చిత్రం కథను పూర్తి స్థాయిలో పూర్తి చేయడంపై రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ దృష్టి పెట్టాడు. ఎట్టకేలకు కథ పూర్తి అయిందని తెలుస్తోంది. ఇద్దరు స్టార్స్‌కి సమతూకం ఉండేలా ఉందా? లేదా? అని రాజమౌళి ఎంతగానో సమయం కేటాయించి చివరకు ఇదే కథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
కథ సిద్దం కావడంతో ఇక స్క్రీన్‌ప్లే, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టాడని అంటున్నారు. సంక్రాంతి పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసుకుని ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక రాజమౌళి అంటేనే జక్కన్న. ఆయన ఈ స్క్రిప్ట్‌ని ఏకంగా 10 నెలల పాటు చెక్కి చెక్కి అక్టోబర్‌లో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు. అలా షూటింగ్ ప్రారంభించిన మరో 10 నెలల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తాడట. ఇక ఇందులో గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లకి చోటు లేదు కాబట్టి 10 నెలల్లో పూర్తి చేయడం పెద్దగా కష్టమేమీ కాదు. మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం విదేశీ ట్రెయినర్ పర్యవేక్షణలో బరువు తగ్గి ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. రామ్‌చరణ్ దీని ముందు చేయబోయే బోయపాటి చిత్రం కూడా దానయ్యకే చేస్తుండటం విశేషం. ఇందు కోసం చరణ్ బాడీ బిల్డింగ్ చేయనున్నాడు. అంటే ఒకవైపు ఎన్టీఆర్ బరువు తగ్గుతుంటే, చరణ్ బరువు పెరుగుతున్నాడు. ఈ ఇద్దరు అక్టోబర్ కల్లా ఫ్రీ కావాలని జక్కన్న సూచించడంతో వారు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని సమాచారం.