రాజకీయనాయకునిగా, కాపు నేతగా ముద్రగడ పద్మనాభానికి ఎంతో పేరుంది. ఆయన కులం పేరుతో రాజకీయాలు చేసినా కూడా కాపులందరినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇక తుని దుర్ఘటనలో ఆయన పాత్ర ఏ మేరకు అనేది పక్కనపెడితే అంతమంది కాపులని ఒకే చోటికి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో ఆయన పాదయాత్ర అనే పదం ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక కాంగ్రెస్, వైఎస్‌ఆర్ ఉన్నంతకాలం కాపులు గుర్తుకురాని ముద్రగడకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అవి గుర్తుకు వచ్చాయా? అని ఆ కులం వారిచేతనే బాబు ఆయనపై ఎదురుదాడి చేయించాడు.
ఇక ఆయన ఇంట్లో ఆమరణ దీక్ష చేసేటప్పుడు, తర్వాత దాసరి, చిరు వంటి వారు కూడా కలిసి ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ ఆయనపై పవన్ మాత్రం ఎప్పుడు స్పందించలేదు. ఇక కాపులు ప్రస్తుతం ముద్రగడను తమ నాయకుడిగా భావిస్తున్నారా? పవన్ బాట పట్టనున్నారా? అనే విషయం ఆసక్తిని రేపుతోంది. ఓ వైపు కాపులు ఓ హీరోగా పవన్ అభిమానంతో ఉండవచ్చని, కానీ సినిమా వేరు రాజకీయాలువేరని, రాజకీయనాయకుడైన ముద్రగడకే కాపులు మద్దతిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. అందులో ఎంత నిజముందో తెలియదు.
ఇక కాపు కార్పొరేషన్‌తో పాటు వారికి రిజర్వేషన్లు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, అందులో పవన్ దానిలో కీలక పాత్ర పోషించి, కాపు రిజర్వేషన్లు విషయంలో ఎన్నికల్లో చెప్పిన మాటకే చంద్రబాబు కట్టుబడి ఉండాలని చెప్పడం ఇక్కడ గమనార్హం. మరోవైపు పవన్ వల్ల కాపులు, కమ్మ వారు ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. కిందటి ఎన్నికల్లో కూడా కాపులు చంద్రబాబు వెంటే ఉన్నారు. ఇక తన ఉద్యమానికి మద్దతు తెలపకపోయినా కాపు రిజర్వేషన్ల విషయంలో గట్టిగా స్పందించినందుకు పవన్‌కి గతంలో ముద్రగడ కృతజ్ఞతలు తెలిపాడు.
మరోసారి ఆయన పవన్ బాబుతో భేటీ తర్వాత ఆయన ఉచ్చులో, మాయమాటలో పడవద్దని పవన్‌కి లేఖ రాశాడు. కానీ ఇవ్వన్నీ మర్చిపోయి తాజాగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సంస్థానాదీశులను కలవడానికి వచ్చారు. వెంకటగిరి సంస్థానాదీశులు మొదటి నుంచి తెలుగుదేశంకి అనుకూలం. వారి వారసుడైన సాయికృష్ణ యాచేంద్ర గతంలో రెండు మూడు పర్యాయాలు టిడిపి తరపున ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు.
ఈ సందర్భంగా మీడియా జనసేన అధినేత పవన్ గురించి ప్రశ్నించగా, పవన్ ఎవరో నాకు తెలియదంటూ ముద్రగడ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.