రజనీకాంత్‌కి ప్రతి పార్టీలోని పెద్దలతో మంచి సత్సంబంధాలున్నాయి. మోదీ, బాల్‌ధాక్రే, చిదంబరం, కరుణానిధితో పాటు సినిమాల పరంగా కూడా కమల్‌హాసన్ వంటి వారు ఆయనకు అత్యంత ఆప్తులే. కానీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకులరాలు జయలలిత చీరను లాగేశారు. అదే మనసులో పెట్టుకున్న జయ తాను అధికారంలోకి రాగానే కరుణానిధిని ముసలి వయసులో కూడా పోలీస్ జీప్ ఎక్కించి జైలుకి పంపించింది. మిగిలిన దేశంలోని రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే, తమిళనాట రాజకీయాలు మాత్రం మరో ఎత్తు. ప్రత్యర్ధులు కేవలం రాజకీయపరంగానే కాదు.. వారు అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా కూడా కక్ష్యంలు తీర్చుకునే రాజకీయాలు తమిళనాడుకే సొంతం.
ఇక కేవలం పంచెకట్టిన ఓ తమిళుడు అంటే చిదంబరం ప్రధానమంత్రి కావాలని వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్‌కి, జయకు మద్దతు ఇవ్వని విజయ్‌కి 'విశ్వరూపం, అన్న' చిత్రాల సమయంలో జయ మూడు చెరువుల నీళ్లు తాగించింది. అక్కడి పార్టీ మద్దతుదారులు కూడా ఇలా పరస్పరం కత్తులు దూసుకుంటూనే ఉంటారు. మరి అలాంటి తమిళనాడులో రజనీ ఎంతగా నెట్టుకురాగలడు? అనేది సందేహాలకు తావిస్తోంది. రాజకీయం రాజకీయం, సినిమా సినిమా, నిజజీవితం నిజజీవితం అనే స్పష్టమైన విభజన రేఖ రజనీకి ఉంది. తాజాగా ఆయన కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వచ్చాడు. దాంతో రజనీ వచ్చే ఎన్నికల్లో బిజెపి-డీఎంకేలతో కలిసి పనిచేస్తాడనే అనవసరపు ప్రచారానికి తావిచ్చాడు. మరోవైపు రజనీకి అమితాబ్, ఖుష్బూ, కమల్‌హాసన్, రాంగోపాల్‌వర్మల నుంచే కాదు తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానుల నుంచి బాగా మద్దతు లభిస్తోంది.
రజనీకి వీరాభిమాని అయిన రాఘవలారెన్స్ రజనీతో పనిచేస్తానని ఆల్‌రెడీ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఇక మరో ప్రముఖుడు ప్రస్తుతం రజనీ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నిన్నటివరకు భారీ చిత్రాలను నిర్మించే సంస్థగా, రజనీ, అక్షయ్‌కుమార్, శంకర్‌లతో '2.0' చిత్రాన్ని నిర్మిస్తోన్న లైకా సంస్థకి చెందిన క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న రాజు మహాలింగం లైకా సంస్థ ఉద్యోగానికి రాజీనామా చేసి రజనీ వెంట నడవాలని నిర్ణయించుకున్నాడు. '2.0' సందర్భంగా రజనీ సిద్దాంతాలు నచ్చి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇక లైకా సంస్థ అధినేతలు శ్రీలంక అనుకూలురని పెద్ద గొడవే ఉంది. దీంతో కావేరి సమస్య, శ్రీలంక తమిళులు వంటి విషయాలలో రజనీని ఇరుకునపెట్టాలని ప్రత్యర్ధులు ఆలోచిస్తున్నారు.