పవన్ అభిమానులకు, కత్తి మహేష్‌కి జరుగుతున్న వార్ అందరికీ తెలిసిందే. పవన్ విషయంలో కత్తి మహేషే కాదు అందరూ పవన్ ఫ్యాన్స్ తీరును తప్పుపడుతున్నారు. స్వయంగా ఆయన కుటుంబసభ్యులే అయిన అల్లుఅర్జున్, నాగబాబు వంటి వారే పవన్ అభిమానులపైన ఎగిరిపడటం తెలిసిందే. వారి పరిస్థితే అలా ఉంటే ఇక సామాన్య విమర్శకుల సంగతి ఏమిటి? అనేది ఓ ప్రశ్న. ఇక సమాజంలో అద్దాలమేడలో ఉన్నవారే జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎవరు విమర్శలు చేసినా, తప్పుగా మాట్లాడినా ఆ ఎఫెక్ట్ ఆయా పెద్దలకే కాస్త అయిన ప్రభావితం చూపిస్తాయి. అదే సామాన్యుల విషయానికి వస్తే వారు పెద్ద వారిపై విమర్శలు చేసినందు వల్ల మహా అయితే గొడవలు వస్తాయి అంతే. అదే సమయంలో అనవసరపు పబ్లిసిటీ కూడా ఆయా వ్యక్తులకు వస్తుంది. ఈ విషయంలో ఆకువెళ్లి ముల్లు మీద పడ్డా.. ముళ్లు వెళ్లి ఆకు మీద పడ్డా డ్యామేజీ మాత్రం ఆకుకే అంటే పెద్దలకే. ఇక పవన్ ఫ్యాన్స్ ఇంతగా రెచ్చిపోతున్నా పవన్ స్పందించక పోవడం, తన ఉద్దేశ్యం ఏమిటో చెప్పకపోవడం మాత్రం సమంజసం కాదు.
ఇక తాజాగా ఓ టీవీఛానెల్ డిబేట్‌లో కత్తి మహేష్‌కి పవన్ అభిమాని దిలీప్‌సుంకరకి పెద్ద మాటల యుద్దమే నడిచింది. దీనిలో కత్తి మహేష్ తన సంయమనం కోల్పోయి తీవ్ర పదజాలం వాడాడు. ఎంతైనా ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి సంయమనం కోల్పోవడం సరికాదు. దీనిపై ఆయన ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చాడు. నేను సంయమనం కోల్పోయానని నా మిత్రులు కూడా భావిస్తున్నారు. నాకు అదే అనిపిస్తోంది. కానీ ఆ సంఘటన నేపధ్యం అర్ధం చేసుకోండి. పవన్ అభిమానులు హేయమైన విధంగా నాపై అప్రజాస్వామికమైన దాడి చేస్తున్నారు. దీనిపై మౌనంగా ఉంటూ ఉండి, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న పవన్‌పై నాకెందుకు గౌరవం ఉండాలి? పవన్ ఫ్యాన్స్ నన్ను, నా కుటుంబ సభ్యులను, నా వృత్తిని.... ఇలా అన్నింటి మీద దాడి చేస్తూ బూతులు వాడుతున్నారు. నేనేదో ఫేమస్ అవ్వాలని, ఓ పార్టీకి నేను తొత్తునని అంటున్నారు. ఇక అప్పటికీ నేనెంతో సంయమనం పాటించాను.
రేణుదేశాయ్ విషయం పబ్లిక్‌లో జరిగింది. అది పర్సనల్ కాదు. ఫ్యాన్స్‌కి భయపడి మూలన నక్కి ఒక్క మాట కూడా మాట్లాడని పవన్‌ని నేనెందుకు గౌరవించాలి. ఈ సంయమనం మరింత కోల్పోకుండా చూసుకోండి. ఆ చెలియలి కట్ట తెగితే ఖర్సైపోయేది పవనే అంటూ వ్యాఖ్యనించాడు. మరోవైపు ఈయన పవన్ మీదనే కాదు త్రివిక్రమ్‌పై కూడా పరుషజాలంతో కామెంట్స్ చేశాడు. మరి అనవసరంగా సీన్‌లోలేని త్రివిక్రమ్‌ని మహేష్ టార్గెట్ చేయడం ఏ విధంగా సమంజసం అనేది ఆయనకే తెలియాలి....!