మానవులన్న తర్వాత అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. తప్పు చేయని వారంటూ ఉండరు. ఇక జరిగిన తప్పుకు పశ్చాత్తాపపడి, నిజాయితీగా తప్పును ఒప్పుకుంటే ఏ బాధ ఉండదు. కానీ ప్రముఖ యాంకర్, నటుడు మాచిరాజు ప్రదీప్ న్యూఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీ తెల్లవారుజామున డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పట్టుబడిన దాదాపు 1200 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ ప్రదీప్ మాత్రం ఈ కౌన్సిలింగ్‌కి హాజరుకాకపోవడంతో ఈ కేసు మరింత ముదురుతోంది. ఆయన ఎంతో విలువ చేసే బిఎండబ్ల్యూ కారును కూడా విడిపించుకోవడానికి రాలేదు. నిజానికి ఆయన మొన్ననే తన తల్లిదండ్రులు, లేదా బంధుల సమక్షంలో పోలీసుల ముందు హాజరై కౌన్సిలింగ్ తీసుకోవాల్సివుంది. కానీ ఆయన హాజరుకాకపోవడంతో పోలీసులు మణికొండలోని ఆయన అపార్ట్‌మెంట్‌కి వెళ్లితే తలుపులు మూసి వేసి తాళం వేసి ఉన్నాయి.
ఇక ఆయన ఆఫీస్ కూకట్‌పల్లిలో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లినా కూడా అదే పరిస్థితి. ఇక ప్రదీప్ పట్టుబడిన సమయంలో కారులో ఆయనతో పాటు మరో అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని తెలుస్తోంది. దాంతో వారెవ్వరా? అనే విషయంపై కూడా విచారణ జరుగుతోంది. గతంలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రదీప్ ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక 50 బిఎంసీ రీడింగ్ వస్తే ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిఓ రోజు జైలు శిక్ష విధిస్తారు.
కానీ ప్రదీప్ పట్టుబడినప్పుడు బ్రీతింగ్‌లో 170 బిఎంసీ రీడింగ్ నమోదైంది. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసివుందని ఆయన సన్నిహితులే కాదు.. పోలీసులు కూడా అంటున్నారు. మరోవైపు ప్రదీప్ పవన్‌కళ్యాణ్‌కి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి బాగా కావాల్సిన వ్యక్తి. దాంతో ఆయన ఇతర మార్గాల ద్వారా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయినా తప్పు చేసినప్పుడు ఒప్పుకుని లొంగిపోతే ఈ కేసు తీవ్రత కాస్త తగ్గుతుంది. పోవాల్సిన పరువు ఎలాగూ పోయింది. మరి ప్రదీప్ ఇలా ఎంత కాలమని అజ్ఞాతంలో ఉంటాడో వేచిచూడాల్సివుంది. ఈ రోజు కూడా ఆయన పోలీసుల ముందుకు హాజరుకాకపోతే ఆయనపై లా అండ్ ఆర్డర్ పరిధిలో కేసును పెట్టనున్నారు. అప్పుడైతే ఇక తీవ్ర శిక్ష తప్పకపోవచ్చు.