అనసూయది యాంకర్ స్థాయే అయినా.. ఆమె ఎన్నో విధాలుగా కన్విన్స్ అయితే మాత్రమే సినిమాలలో నటించదని, ఆమెకి సరైన పాత్ర లేకపోతే ఒప్పుకోదనే టాక్ ఉంది. దానికి ఉదాహరణ 'అత్తారింటికి దారేది'కి ఆమె నో చెప్పడమే. ఇక ఆ తర్వాత 'క్షణం', 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి చిత్రాలలో కూడా కాస్త డైలాగ్స్ ఉన్న పాత్రలే చేసింది. 'విన్నర్' చిత్రం కోసం తన పేరుతోనే ఓ ఐటం సాంగ్‌ని రాయడంతో ఓకే అంది. ఇక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఈ బ్యూటీ మాత్రం గ్లామర్ పాత్రలు, కాస్త శృంగారంగా కనిపించే పాత్రలే చేస్తోంది. మరదలుగానే గాక ఆమె త్వరలో యంగ్ మేనత్తగా కూడా ప్రేక్షకులను అలరించబోతోంది.
సాధారణంగా యంగ్ హీరోకే కాదు... ఎవరికైనా అత్త, మేనత్త పాత్రలంటే ముసలి పాత్రలు అనే అభిప్రాయం ఉంది. కానీ నేటి సమాజంలో కూడా మేనత్త, మేనల్లుళ్ల వయసు దాదాపు సరిసమానంగా ఉండేవారు కూడా బాగానే కనిపిస్తూ ఉంటారు. ఇలా యంగ్ మేనత్తగా అనసూయ రామ్‌చరణ్ -సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందతున్న 'రంగస్థలం 1985'లో నటిస్తోంది. ఇందులో ఆమెది చరణ్ మేనత్త పాత్రే కాదు.. చాలా కీ రోల్ అని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంపార్టెంట్ సీన్‌ని పూర్తి చేసుకున్నామని చెబుతూ, రామ్‌చరణ్‌తో కలిసి తన కుమారుడితో సెల్ఫీ దిగింది.
ఇక 'రంగస్థలం 1985' చిత్రం పీరియాడికల్ మూవీగా 1985 ప్రాంతాలలో జరిగే కథగా రూపొందుతోంది. ఇప్పటివరకు కేవలం ఈ చిత్రంలో రామ్‌చరణ్ గెటప్‌ని మాత్రమే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇందులో పంచెకట్టులో రామ్‌చరణ్ గుబురు గడ్డం పెంచుకుని పక్కా మాస్ గ్రామీణ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఇక కొన్ని లీక్‌డ్ ఫొటోలలో సమంత బర్రెలు తోలుతూ, గిన్నెలు కడుగుతూ దర్శనమిచ్చి డీగ్లామరైజ్‌డ్ పాత్రలో నటిస్తున్నట్లుగా షాక్ ఇచ్చింది. క్రిస్మస్, జనవరి 1ల కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యూనిట్ తాజా షెడ్యూల్‌ని ప్రారంభించింది.
ఈ షెడ్యూల్ 12 వతేదీ వరకు జరుగుతుంది. అనంతరం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఓ షెడ్యూల్‌ని ప్లాన్ చేసి అందులో పాటలను చిత్రీకరించనున్నారు. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, రావు రమేష్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరి ఈ చిత్రంలో మేనత్త-మేనల్లుడు మద్య ఏదైనా టీజింగ్ సాంగ్ ఉంటుందో లేదో వేచిచూడాల్సివుంది..!