నాడు ఎన్టీఆర్-ఏయన్నార్, ఎన్టీఆర్-కృష్ణ, కృష్ణ-కృష్ణంరాజు, కృష్ణ-శోభన్‌బాబు వంటి వారు ఎన్నో మల్టీస్టారర్స్ చేశారు. వారిలో కృష్ణ-శోభన్‌బాబు కాంబినేషన్‌లో కూడా 'ముందడుగు'తో పాటు కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. వాటిల్లో 'మహాసంగ్రామం' ఒకటి. నాడు నిర్మాతగా భారీ చిత్రాలను నిర్మించే తిరుపతి రెడ్డి ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్లాప్ కావడమే కాదు.. నాడు శోభన్‌బాబు ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నాడు ఈ చిత్రం విడుదలైన తర్వాత తన పాత్రకు ఇందులో ప్రాధాన్యం లేకుండా మొత్తం కృష్ణని హైలైట్ చేశారని, ఇక తాను జన్మలో మల్టీస్టారర్ చిత్రాలు చేయమని మీడియా ముందే శోభన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని గురించి ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం కథ, మాటలను నేను.. అన్నయ్య తయారు చేశాం. ఈ కథ సింగిల్ హీరో కథ. దాంతో ఎన్టీఆర్‌కి వినిపించాం. దానికి ఆయన చూద్దాం బ్రదర్ అన్నారు. అంత మంచి కథని ఆయన ఎందుకు చూద్దాం అన్నారో మాకు అర్ధం కాలేదు. దాంతో అన్నగారూ రాజకీయాలలోకి వెళ్తున్నారా? అని అడిగాం. దానికి ఆయన రాజకీయాలలోని వారు నిజాలు మాట్లాడవచ్చా? అని మమ్మల్ని ప్రశ్నించారు. చెప్పకూడదని మేము చెప్పాం. కాబట్టి మేము కూడా చెప్పం అంటూ ఎన్టీఆర్ వెళ్లిపోయారు. నాడు ఈ కథని నిర్మాత ఎం. తిరుపతి రెడ్డి గారు విన్నారు. ఆయన ఈ కథని ఇద్దరు హీరోల కథగా మార్చవచ్చా? అని అడిగారు. సరేనని చెప్పి ఆ కథను మేము మల్టీస్టారర్‌గా మార్చాం.
అందులో శోభన్‌బాబు మిలిటరీ ఆఫీసర్. కానీ చిత్రం సెన్సార్ సమయంలో సభ్యుడైన ఓ మిలిటరీ ఆఫీసర్ ఈ చిత్రంలోని మిలిటరీ అధికారి శోభన్‌బాబుపై తీసిన కామెడీ సీన్స్‌కి అభ్యంతరం చెప్పారు. దాంతో శోభన్‌బాబుగారు నటించిన మూడు వేల నిడివి కలిగిన సీన్స్ సెన్సార్‌లో కట్ అయ్యాయి. దాంతో సినిమా రిలీజ్ తర్వాత శోభన్‌బాబుకి కోపం వచ్చింది. 'ఐవిల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్' అని ఎవరి వద్దో అన్నారు. దాని అర్ధం పరుచూరి బ్రదర్స్‌ని ఊచకోత కోస్తానని అర్ధం. ఆ విషయం మాకు తెలిసింది. శోభన్‌బాబుగారు మా గురించి ఎందుకు అలా అన్నారో మాకు అర్ధం కాలేదు. రెండేళ్ల తర్వాత అసలు విషయం తెలిసి శోభన్‌బాబు గారు తిరుపతి రెడ్డికి సారీ చెప్పారు అని చెప్పుకొచ్చాడు.
శోభన్‌బాబు ఒక్కసారి సినిమా కమిట్ అయితే ఏ విషయం పట్టించుకోడు. అయితే రెమ్యూనరేషన్ నుంచి అన్ని విషయాలలోనూ స్ట్రిక్ట్‌గా ఉంటాడనే పేరుంది కానీ ఆయనపై వివాదాలు లేవు. ఇక నాడు తిరుపతి రెడ్డి వద్ద కృష్ణ,శోభన్‌బాబు ఇద్దరి డేట్స్ ఉండటమే ఈ సింగిల్ హీరో కథని మల్టీస్టారర్‌గా మార్చడానికి కారణం. మొత్తానికి శోభన్‌బాబుకి ఎంతో కోపం వచ్చి ఉంటే గానీ అంతటి సాత్వికుడు అలా అనడని అందరూ అంటారు.